బ్యాంకు లింకేజీలో ప్రథమస్థానం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:56 PM
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రెండో రోజు శుక్రవారం కలెక్టర్ల సదస్సు జరిగింది.
- ఆటో డ్రైవర్ సేవా పథకంలో నాలుగు..
-సోలార్ విద్యుత్‌లో 14..
- 6 శాతానికే పరిమితమైన ‘అనంత్ అరణ్య’
- స్త్రీశక్తి పథకానికి మంచి స్పందన
- పెరిగిన సైబర్ క్రైం
- ఇవీ జిల్లా గణాంకాలు
- సీఎం- కలెక్టర్ల సదస్సులో వెల్లడి
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రెండో రోజు శుక్రవారం కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి సంబంధించిన పలు గణాంకాలను కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వెల్లడించారు. గ్రామీణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు అందజేయడంలో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. జిల్లాలోని 56,185 మహిళలకు రూ.697.38 కోట్ల రుణాలు అందించి, 86.75 శాతం లక్ష్యం సాధించింది. ఆటో డ్రైవర్ సేవా పథకంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 15,479 మంది డ్రైవర్లకు వార్షిక సాయం అందింది. పట్టణ పరిఽధిలో స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో 10 స్థానంలో నిలిచింది. 961 గ్రూపులకు రూ.139.10 కోట్ల రుణాలు పంపిణీ చేసి 44.80 శాతం లక్ష్యం చేరుకుంది.
స్త్రీ శక్తి పథకం..
స్ర్తీశక్తి పథకానికి జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకూ జిల్లాలో 187.13 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. రోజువారి సగటున 49వేల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆక్యుపెన్సీ నిష్పత్తి, జిల్లా డిపోల ఆక్యుపెన్సీ రేషియో 107 శాతంగా నమోదైంది.
-జిల్లాలో ఇప్పటి వరకూ 1.41లక్షల మంది దివ్యాంగుల్లో 50 శాతం ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. 532 మంది ఎస్కార్టులు ఉచితంగా రాయితీ బస్సు ప్రయాణం పొందారు
‘సోలారు’.. ‘అనంత్ అరుణ్య’లో వెనుకబాటు
సోలార్ విద్యుత్ పానెళ్ల ఏర్పాటులో జిల్లా 14వ స్థానంలోకి వెళ్లింది. విద్య, సంక్షేమ సంస్థల్లో 1,14 ఎండబ్ల్యూ కనీస సోలార్ పానెళ్ల సామర్థ్యం ద్వారా ఏటా 1,081.9 టన్నుల సీవో2 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెట్ జీరీ హెల్తీ క్యాంపస్ పురోగతి మందగించింది. మొక్కల పెంపకం వంటి పర్యావరణ రక్షణ కార్యక్రమాల్లో జిల్లా వెనుకబడి ఉంది. అనంత్ అరణ్య ప్లాంటేషన్‌లో భాగంగా 45,435 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ కేవలం 2,966 మాత్రమే నాటారు. 6.5 శాతానికి పరిమితమైంది. 49 ఇంకుడు గుంతల లక్ష్యంగా చేపట్టిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
కాస్త పెరిగిన సైబర్ క్రైం..
జిల్లాలో సైబర్ క్రైం ఫిర్యాదుల సంఖ్య కాస్త పెరిగింది. గతేడాది 1,891 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 2,006 ఫిర్యాదులు వచ్చాయి. 6.1 శాతం పెరిగింది. మత్తు పదార్థాలపై నమోదైన కేసులు జిల్లాలో చాలా తగ్గాయి. జిల్లాలో గత ఏడాది 124 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 39 వరకూ తగ్గాయి.