Share News

రేపే తొలి విడత పల్లెపోరు

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:57 PM

First Phase of Rural Elections Tomorrow జిల్లాలో మొదటి విడత పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. ఈనెల 26న పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం జియ్యమ్మవలస , గురుగుబిల్లి, కొమరాడ, కురుపాం మండలాల్లోని 226 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌, 2,116 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రేపే తొలి విడత పల్లెపోరు
గరుగుబిల్లి: పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది

  • పోలింగ్‌కు సన్నద్ధమైన యంత్రాంగం

  • మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఓటింగ్‌

  • ఆ తర్వాత కౌంటింగ్‌.. విజేతలను ప్రకటించనున్న అధికారులు

  • అదే రోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక

పార్వతీపురం, నవంబరు 24 ( ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొదటి విడత పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. ఈనెల 26న పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం జియ్యమ్మవలస , గురుగుబిల్లి, కొమరాడ, కురుపాం మండలాల్లోని 226 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌, 2,116 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ 16 నుంచి నామినేషన్‌ స్వీకరణ చేపట్టగా.. ఇందుకోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18న నామినేషన్‌ పత్రాలను పరిశీలించారు. 21న ఉపసంహరణ పూర్తయిన తర్వాత అధికారులు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. అనంతరం వారికి గుర్తులను కేటాయించారు. అయితే అవే గుర్తులతో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించారు. మొత్తంగా సర్పంచ్‌లకు 1,182, వార్డు సభ్యులకు 4,011 నామినేషన్లు రాగా.. 33 పంచాయతీలు , 970 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 93 పంచాయతీల్లోని సర్పంచులు, 1146 వార్డుల సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సుమారు3 లక్షల మంది తమ ఓటు హక్కను వినియోగించు కోనున్నారు. ప్రతి ఓటరూ సర్పంచుకు , వార్డు సభ్యునికి వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత క్యూలైన్లో ఉన్న వారు ఓటరు ఓటు వేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్నికల రిట్నరింగ్‌ అధికారులు విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. పోలింగ్‌ రోజునే ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపోతే ఎన్నికల విధులకు హాజరయ్యే వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు బారులుదీరారు. దీంతో మండల కార్యాలయాలన్నీ మంగళవారం కిటకిటలాడాయి.

తీవ్ర పోటీ

జిల్లాలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, తదితర మండలాల్లోని కొన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచు పదవి కోసం ‘నువ్వా-నేనా’ అనే విధంగా తలపడుతున్నారు. దీంతో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని పంచాయతీల్లో కొంతమంది అభ్యర్థుల తరపున ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ఇంకొన్ని పంచాయతీల్లో ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండిపోతున్నారు.

వలస ఓటర్లకు పిలుపు..

సర్పంచ్‌ అభ్యర్థులు గురువారం జరిగే మొదటి దశ పంచాయతీ పోలింగ్‌కు వలస ఓటర్లను రప్పించే పనిలో పడ్డారు. వాస్తవంగా కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో సుమారు 20 వేలమంది వలస ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థులు తమ పంచాయతీ పరిధిలోని వలస ఓటర్లకు రానుపోను బస్సు లేదా రైలు చార్జీలతో ఇతర ఖర్చులకు ఫోన్‌పే చేశారు. మరి కొంతమంది టిక్కెట్లు రిజర్వేషన్లు చేసి కొరియర్‌ ద్వారా పంపించారు. ఈ క్రమంలో వలస ఓటర్లు బుధవారం ఉదయం స్వగ్రామాలకు చేరుకుని.. గురువారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. మొత్తంగా ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి ఎన్నికల ఖర్చు ఒక పంచాయతీకి రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పైగా దాటుతోంది. అయితే అధికంగా ఖర్చు చేస్తున్నా.. గెలుస్తామో లేదోనని వారు టెన్షన్‌ పడుతున్నారు. ఏదేమైనా అభ్యర్థుల భవితవ్యం 26న సాయంత్రం తేలనుంది.

సెలవులేదు..విమానంలో వస్తా..

సర్పంచ్‌ అభ్యర్థి పిలుపు మేరకు పార్వతీపురం మండలం ఓ పంచాయతీ పరిధిలోని వలస ఓటరు స్వగ్రామానికి వచ్చేందుకు అంగీకరించారు. అయితే తనకు సెలవు లేదు.. విమానంలో వస్తానని చెప్పడంతో సర్పంచ్‌ అభ్యర్థి అవాక్కయ్యారు. తరువాత ఆ ఓటరే ఫోన్‌ చేసి విమానం కాదు గానీ ఏదో ఒక విధంగా వీలు చూసుకుని వచ్చి ఓటు వేస్తానని ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో సర్పంచ్‌ అభ్యర్థి ఊపిరిపీల్చుకున్నారు.

ప్రచారానికి తెర

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ప్రచార గడువు ముగిసింది. ఈ మేరకు పోలింగ్‌ జరగనున్న 193 పంచాయతీల్లో ప్రచారాలకు తెర పడింది. దీంతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనగా.. పలుచోట్ల ప్రలోభాల పర్వం మొదలైంది. కొంతమంది సర్పంచ్‌ అభ్యర్థులు ఓటరుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు మద్యం బాటిళ్ల సరఫరాకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ప్రలోభాలతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మద్యం దుకాణాలు బంద్‌

బెలగాం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తొలివిడత పల్లెపోరు ఈ నెల 26న జరగనున్న నేపఽథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రశాంత ఎన్నికలకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతానగరం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం మండలాల్లోని పోలింగ్‌ జరిగే అన్ని పంచాయతీల్లో ఈ నెల 24 సాయంత్రం నుంచి 26 ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Nov 24 , 2026 | 11:57 PM