'Fire' gas! ‘మంట’ గ్యాస్!
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:29 AM
'Fire' gas! సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.110లు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
‘మంట’ గ్యాస్!
భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
డొమెస్టిక్ రూ.60.., కమర్షియల్‌పై రూ.110
సామాన్య, మధ్యతరగతి వారిపై ప్రభావం
జిల్లాపై రూ.10 కోట్ల భారం
విజయనగరం, మార్చి 7(ఆంధ్రజ్యోతి):
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.110లు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో సిలిండర్ ధర రూ.965కు చేరుకుంది. అయితే ఉజ్వల్ గ్యాస్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలోనే సుమారు 11 నెలల తరువాత తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి.
జిల్లాలో సుమారు 31 గ్యాస్ ఏజెన్సీల్లో 4,72,900 సిలిండర్లు ఉన్నాయి. నెలకు జిల్లాలో రాయితీ సిలిండర్లకు సంబంధించి దాదాపు 150,000 నుంచి 1,80,000 సిలిండర్ల వాడకం జరుగుతుందని అధికారిక గణంకాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల ధర పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్ ధరలు అంతగా పెరగలేదు. చివరిసారిగా 11 నెలల కిందట గ్యాస్ ధరలు పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో పెంచక తప్పలేదు. దాదాపు 70 శాతం గ్యాస్ సరఫరా గల్ఫ్ దేశాల నుంచి ఉంటోంది. ప్రస్తుతం సరఫరా లేక.. డీలర్ల వద్ద నిల్వలు తగ్గిపోయాయి. అందుకే చమురు సంస్థలు గ్యాస్ ధరను పెంచినట్టు తెలుస్తోంది. అయితే గృహ వినియోగంతో పాటు వాణిజ్య అవసరాలకు సంబంధించి గ్యాస్ ధర పెరుగుదలతో నెలకు జిల్లాపై రూ.10 కోట్ల వరకూ ప్రభావం చూపే అవకాశం ఉంది.
అదనపు భారం..
జిల్లాలో గృహ వినియోగదారులకు సంబంధించి 14. 2 కిలోలల గ్యాస్ సిలిండర్ పాత ధర రూ.883 వరకూ ఉండేది. ఇప్పుడు రూ.943 పైమాటే. అయితే ముగ్గురుండే చిన్న కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ ఖర్చు అవుతుంది. అదే నలుగురి కంటే ఎక్కువగా ఉండేవారికి మాత్రం నెలకు విధిగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉండాల్సిందే. ఈ లెక్కన సాధారణ కుటుంబానికి నెలకు అదనంగా రూ.120ల వరకూ భారం తప్పదు. అదే ధర కొనసాగితే ఏడాదికి రూ.1500 వరకూ భారం తప్పనిసరి. అయితే ప్రభుత్వం 3 లక్షలకుపైగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. ఇదే సమయంలో ఉచిత గ్యాస్ పథకానికి కూడా భారం పెరిగినట్టే. జిల్లాలో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి మాత్రం పెరిగిన ధరలు వర్తించవని చమురు సంస్థలు చెబుతున్నాయి.
వాణిజ్య సంస్థలపై పెను భారం..
జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు 50 వేలకుపైగా ఉంటాయి.వీటికి ఎటువంటి రాయితీ ఉండదు. వీటికి సంబంధించి ధర రూ.110లకు పెరిగింది. 19 కిలోల బరువు ఉండే ఈ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1890కు చేరుకుంది. అయితే ఒకేసారి ఇంత ధర పెరగడంతో వాణిజ్య సంస్థలపై భారం తప్పదు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై తీరని ప్రభావం చూపుతుంది. గ్యాస్ ధర పెరిగిందని సాకుగా చూపి ఏకంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెంచవచ్చు. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, సంస్థలకు నిర్వహణ అనేది భారంగా మారనుంది.
అదనంగా వసూలు చేస్తే చర్యలు
జిల్లాలో పెరిగిన ధరలకు అనుగుణంగా మాత్రమే సిలిండర్ల ధర వసూలు చేయాలి. అదనంగా వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదుచేస్తాం. గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.
- మురళీధర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, విజయనగరం
మాలాంటి వారికి భారమే..
గ్యాస్ సిలిండర్‌పై రూ.60 ధర పెరగడం మాలాంటి వారికి భారమే. నెలకు రెండు గ్యాస్ సిలిండర్లు అవుతాయి. ఈ లెక్కన కుటుంబంపై రూ.120లు అదనపు భారం పడనుంది. నెలకు రూ.2 వేలు గ్యాస్‌కే ఖర్చుచేస్తే మిగతా నిత్యావసరాలు ఎలా కొనేది.
- లక్ష్మి, గృహిణి, విజయనగరం
==========