బెర్రీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:22 AM
బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన యూపీ కార్మికుడు
బొబ్బిలి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లా ఘరంపూరి ఘోపాల్ గ్రామానికి చెందిన కార్మికుడు సరోజ్‌పాల్ (35) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిశ్రమలో సుమారు ఏడాదిన్నర కాలం నుంచి ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్‌గా సరోజ్‌పాల్ పనిచేస్తున్నాడు. ప్లాంట్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను నింపుతుండగా పైప్ లీకై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముఖం, రెండు చేతులు, కాళ్లు కాలిపోయాయి. సుమారు 60 శాతం మేర శరీరం కాలిపోయింది. గాయపడిన సరోజ్‌పాల్‌తో పాటు మరో కార్మికుడిని స్ధానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 72 గంటల పాటు సరోజ్‌పాల్ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యుడు తెలిపారు. ఇదే ప్రమాదంలో బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన కార్మికుడు ఎందవ సీతయ్య కూడా గాయపడ్డాడు. నెలన్నర క్రితమే ఈ పరిశ్రమలో హౌస్‌క్లీనింగ్ జాబ్‌లో చేరాడు. ఆక్సిజన్ పైపు లీకై అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ఉండడంతో అతడు కూడా స్వల్పంగా గాయపడ్డారు. తలవెనుక, కాలికి, చేతికి ఆయనకు గాయాలయ్యాయి.