Share News

Fine There... But What About Here? అక్కడ సరే.. మరి ఇక్కడో..?

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:30 PM

Fine There... But What About Here? పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్షాళన మొదలవగా.. మరి సీతంపేట ఐటీడీఏ పరిస్థితేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దశాబ్దాలుగా అక్కడ ఒకే కార్యాలయంలో ఉండి విధులు నిర్వహిస్తున్న కొంతమందికి ఇటీవల స్థానచలనం కల్పించారు.

Fine There... But What About Here? అక్కడ సరే.. మరి ఇక్కడో..?
సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

  • కీలకశాఖల్లో పాతుకుపోయిన ఉద్యోగులు

  • మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత

  • సర్దుబాటు చేయని అధికారులు

  • సమూల మార్పులు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్‌

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్షాళన మొదలవగా.. మరి సీతంపేట ఐటీడీఏ పరిస్థితేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దశాబ్దాలుగా అక్కడ ఒకే కార్యాలయంలో ఉండి విధులు నిర్వహిస్తున్న కొంతమందికి ఇటీవల స్థానచలనం కల్పించారు. వారి కుర్చీలను మార్చి.. బదిలీలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్వతీపురంలో చేపట్టిన విధంగానే సీతంపేటలోనూ సమూల మార్పులు చేయాలని గిరిజ సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల పాలన సౌలభ్యంతో పాటు గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందుతా యని, అభివృద్థి పనులు వేగవంతమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రధానంగా గిరిజన సంక్షేమ విద్య, ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌, ఎగ్రికల్చర్‌, వైద్యశాఖ, వెలుగు తదితర శాఖలను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పనులు వేగవంతం కావడం లేదు. గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

- ఐటీడీఏ కార్యాలయంతో పాటు మరికొన్ని శాఖల్లో ఉద్యోగులు ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నారు. వారిలో కొంతమందికి పనిలేకపోవడంతో ఇతర ఉద్యోగులపై మాత్రం భారం పడుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- గతంలో ఐటీడీఏ పీవోగా పనిచేసిన సాయికాంత్‌వర్మ అప్పట్లోనే వివిధ శాఖల్లో సమూలమార్పులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇంతలోనే బదిలీ కావడంతో ఆ ప్రక్రియ కాస్త కార్యరూపం దాల్చలేదు. దీంతో నాటి నుంచి వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులకు స్థానచలనం లేకపోగా.. పోస్టుల భర్తీ కూడా చేయడం లేదు. ఉన్న ఉద్యోగులను శాఖల వారీగా సర్దుబాటు చేయడంపైనా ఎవరూ దృష్టిసారించలేదు.

శాఖల వారీగా ఖాళీలు ..

సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖలో రెగ్యులర్‌ డీఈఈ పోస్టు ఖాళీగా ఉంది. మొత్తంగా 11 మంది ఏఈలు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. ఆరుగురు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గాను ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే అటెండర్‌ పోస్టులు ఎనిమిది వరకు ఖాళీగా ఉన్నాయి. వైద్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుతో పాటు రెండు ట్రైబల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. హార్టికల్చర్‌ శాఖలో హెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. అగ్రికల్చర్‌ శాఖలో పీఏవో పోస్టును ఏడాది కాలంగా భర్తీ చేయడం లేదు. గిరిజన సంక్షేమశాఖ(డీడీ కార్యాలయం)తో పాటు వెలుగుశాఖలో కూడా పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

టైంస్కేల్‌ ఉద్యోగులు ఇలా...

సీతంపేట ఐటీడీఏలో టైంస్కేల్‌ ఉద్యోగుల సంఖ్య అధికంగానే ఉంది. సుమారు 24మంది ఉద్యోగులు గడిచిన కొన్నేళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా ఇక్కడ టైంస్కేల్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారి సేవలను వినియోగించుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఆదిశగా ఐటీడీఏ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే

‘సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. పాలన సౌలభ్యంలో భాగంగా సిబ్బంది బదిలీలపై కూడా పరిశీలిస్తాం.’ అని ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 11:30 PM