“Finally!” ఎట్టకేలకు!
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:48 PM
“Finally!” జిల్లా పరిధిలో కుట్టు శిక్షణ పూర్తయిన అభ్యర్థినులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల అనంతరం కుట్టు మిషన్లు అందించనున్నారు.
వచ్చేనెల 3 వరకు నిర్వహణ
ఏర్పాట్లలో అధికారులు
అర్హత సాధిస్తే కుట్టు మిషన్లు
గరుగుబిల్లి, మార్చి28(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో కుట్టు శిక్షణ పూర్తయిన అభ్యర్థినులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల అనంతరం కుట్టు మిషన్లు అందించనున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం జిల్లా బీసీ కార్పొరేషన్ పరిధిలో కుట్టు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గతేడాది మే, జూన్ నెలల్లో రెండు విడతలుగా 13 మండలాల పరిధిలో 1,323 మందికి కుట్టు శిక్షణ ఇచ్చారు. అయితే శిక్షణ పూర్తయిన అభ్యర్థినులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా ఈ పరీక్షలకు హాజరయ్యే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. బీ1 బ్యాచ్‌కు సంబంధించి ఉదయం 8.30 గంటల నుంచి, బీ2 బ్యాచ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ప్రారంభమవుతుంది. సంబంధిత సమాచారాన్ని ఆయా మండలాల అభివృద్ధి అధికారులకు అందించారు. పార్వతీపురం, సీతానగరం, గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, బలిజిపేట మండలాలకు చెందిన వారు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఇందుల్లో ఉత్తీర్ణత అయిన వారికి కుట్టు మిషన్‌తో పాటు ధ్రువీకరణ పత్రం అందించనున్నారు. ‘కుట్టు శిక్షణ పొందిన అభ్యర్థినులకు పరీక్ష నిర్వహించేం దుకు చర్యలు చేపడుతున్నాం. 65 శాతం హాజరు ఉన్న వారి జాబితాలను మండల అధికారులకు పంపించాం. ఈ నెల 30 నుంచి గుర్తించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. అర్హత సాధించిన అభ్యర్థినులకు కుట్టు మిషన్లు అందించనున్నాం.’ అని జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గడ్డమ్మ తెలిపారు.