Share News

ఓటర్ల జాబితాకు తుదిరూపు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:23 PM

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో యంత్రాంగం తలమునకలై ఉంది. ఓటర్ల జాబితా తుదిరూపు కోసం రెవెన్యూ యంత్రాంగం, బీఎల్‌వోలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి హియరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఓటర్ల జాబితాకు తుదిరూపు
జియ్యమ్మవలస మండలానికి వచ్చిన నోటీసులను పరిశీలిస్తున్న అధికారులు

  • సెప్టెంబరు 8 వరకు హియరింగ్‌

  • జిల్లాలో 1.27 లక్షల మందికి నోటీసులు

జియ్యమ్మవలస, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో యంత్రాంగం తలమునకలై ఉంది. ఓటర్ల జాబితా తుదిరూపు కోసం రెవెన్యూ యంత్రాంగం, బీఎల్‌వోలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి హియరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 8 వరకు జరుగుతుంది. నోటీసులు అందుకున్న వారు తమ గ్రామంలో జరిగే హియరింగ్‌ రోజున ఆధార్‌కార్డుతో పాటు 12 రకాల డాక్యుమెంట్లలో ఏదొఒకటి సమర్పించి దానిపై సంతకం చేసి ఆ గ్రామంలోనే ఉన్నట్లు నిరూపించుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తిని ఓటరుగా గుర్తించి బీఎల్‌వోల తమ లాగిన్‌లో ఆన్‌లైన్‌ చేస్తారు.

1,27,068 మందికి నోటీసులు

జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,077 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,49,188 మంది పురుషులు, 3,66,189 మంది మహిళలు, 66 మంది ఇతరులు కలిపి మొత్తం 7.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సర్‌ కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల రీఅరెంజ్‌మెంట్లతో పాటు ఓటర్ల జాబితా డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ కూడా పూర్తయింది. తప్పులు, విమర్శలకు తావులేని ఓటర్ల జాబితా తయారీయే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించే సమయంలో ఇళ్ల వద్ద లేని వారికి, వలస వెళ్లిన వారిపై దృష్టి సారించారు. ఈ మేరకు 1,27,068 మందికి నోటీసులు అందించారు. సాలూరు నియోజకవర్గంలో 49,558 నోటీసులు, కురుపాంలో 35,298, పార్వతీపురంలో 35,298, పాలకొండ నియోజకవర్గం పరిధిలో 14,766 నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇవ్వబడిన వ్యక్తి 12 రకాల ధ్రువపత్రాల్లో ఆధార్‌కార్డు, ఫొటోతో పాటు ఏదో

ఒక ధ్రువపత్రంపై సంతకం చేసి ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా గత నెల 30లోగా బీఎల్‌వోలు పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా బీఎల్‌వోలు నిమగ్నమై మరళా ఇంటింటికీ వెళ్తున్నారు. ఆ తరువాత ఈ జాబితా అంతా క్రోడీకరించి సెప్టెంబరు 28లోగా ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అనంతరం అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

- ఒకవేళ ఇంతవరకు ఓటరుగా మ్యాపింగ్‌ కాకపోతే 20 ఏళ్ల కిందట ఎక్కడ మ్యాపింగ్‌ అయిందో అక్కడకు వ్యక్తిగతంగా హాజరవుతారు. తాత, తల్లిదండ్రుల ఓట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ ఓటరు జాబితాను తెప్పించి అందులో ఈ ఓటు కలుపుతారు.

-లేకపోతే ఆ వ్యక్తి ఆ గ్రామం వాడే అని తనకున్న ఆధార్‌కార్డుతో పాటు 12 రకాల ఆధారాల్లో ఏదో ఒకటి హియరింగ్‌ రోజున ఇవ్వగలిగితే వాటిని ఆన్‌లైన్‌ చేసి ఆ వ్యక్తి వ్యక్తిగత ఫొటో, అతనితో పాటు బీఎల్‌వో, సూపర్‌వైజర్‌, ఏఈఆర్‌వోలు కలిసి గ్రూపు ఫొటో అంతా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ఉంచుతారు.

- ఒకవేళ ఏ ఆధారం ఇవ్వని పక్షంలో వారికి ఓటు ఎందుకు ఇవ్వలేదో ఏఈఆర్‌వోగా తహసీల్దార్‌ గాని, రెండో ఏఈఆర్‌వోగా ఎంపీడీవో గాని స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చి ఓటును తొలగించేందుకు సిఫారసు చేస్తారు. ఈ హియరింగ్‌ కార్యక్రమాలు సెప్టెంబరు 8వ తేదీ వరకు జరుగుతాయి.

తప్పులు లేని ఓటరు జాబితాయే లక్ష్యం

ఎన్నికల సంఘం జారీ చేసిన విధి విధానాల ప్రకారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయడమే మా ముందున్న కర్తవ్యం. గ్రామాల్లో జరిగే హియరింగ్‌కు మాత్రం సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌వో విధిగా హాజరై సమీక్షిస్తాం.

-ఏఎస్‌ సాయి కామేశ్వరరావు, తహసీల్దార్‌, జియ్యమ్మవలస

Updated Date - Aug 17 , 2026 | 10:22 AM