Waterlogging! గండి పూడ్చక.. నీరు నిలవక!
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:08 AM
Fill the Potholes, Prevent Waterlogging! తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు భారీగా గండి పడి రోజులు గడుస్తున్నా.. ఇంకా దానిని పూడ్చే చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరంతా వృథాగా పోతుంది. మరోవైపు 8వ బ్రాంచి పరిధి శివారు ప్రాంతంలోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
వారం గడుస్తున్నా స్పందించని అధికారులు.. వృథాగా పోతున్న నీరు
శివారు ప్రాంత పంట భూములకు అందని తడి
తీవ్ర ఎండలతో ఆందోళన చెందుతున్న రైతులు
పాలకొండ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు భారీగా గండి పడి రోజులు గడుస్తున్నా.. ఇంకా దానిని పూడ్చే చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరంతా వృథాగా పోతుంది. మరోవైపు 8వ బ్రాంచి పరిధి శివారు ప్రాంతంలోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తుండడంతో వరి పైరు ఎండిపోయే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. యుద్ధప్రాతిపదికన గండిని పూడ్చి సాగునీరు అందించాలని రైతన్నలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాలకొండ మండలం ఓని గ్రామ సమీపంలో తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు భారీ గండి పడింది. ఓనిగెడ్డ ఆక్వాడెక్ట్ పక్కన పడిన గండి మరింత కోతకు గురికావడంతో సాగునీరంతా వృథాగా పోతుంది. ప్రస్తుతం పంట పొలాలు చిరు పొట్ట దశలో ఉన్నాయి. కాలువల ద్వారా సాగునీరు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- వాస్తవంగా మన్యం జిల్లాలోని పలు గ్రామాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండ లంలో పంట పొలాలకు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారానే సాగునీరు అందించాల్సి ఉంది.
- ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటివరకు 8వ బ్రాంచి పరిధిలోని రామభద్రరాజుపేట డిస్ర్టిబ్యూషన్ నుంచి అధికార యంత్రాంగం సాగునీరు అందించలేకపోయింది. దీంతో వర్షాలపైనే ఆధారపడి రైతులు ఇప్పటివరకు పంటను కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువకు గండి పడడంతో పంటలు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
- గండి ప్రభావంతో రామభద్రరాజుపేట పరిధిలోని 400 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ డిస్ర్టిబ్యూటరీ పరిధిలోని గరుగుబిల్లి, ఓని, లుంబూరు, గుడివాడ, పీఆర్‌రాజుపేట తదితర గ్రామాలకు చెందిన పంట భూములున్నాయి.
- 8వ బ్రాంచి పరిధి తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధి వెలగవాడ నరసింహచెరువు డిస్ర్టిబ్యూటరీ నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు చేరడం లేదు. దీంతో సుమారు రెండు వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. దీని పరిధిలో వెలగవాడ, పీఆర్‌రాజుపేట, పాలకొండ, సింగన్నవలస, పరశురాంపురం తదితర గ్రామాల్లో అల్లుసత్యం చెరువు, బత్తులవానిచెరువు, కిష్టప్పచెరువు, సింగన్నవలస చెరువులు ఉన్నాయి.
- పాలవలస డిస్ర్టిబ్యూటరీ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలోని 500 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ డ్రిస్టిబ్యూటరీ పరిధిలో సింగన్నవలస, వెలగవాడ, సిరికొండ, శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలాలకు చెందిన పంట భూములున్నాయి.
- ఇక పాలకొండ మండల పరిధిలోని మరో రెండు వేల ఎకరాలకు ఎడమ ప్రధాన కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు.
- దీనిపై ఇరిగేషన్ ఇన్‌చార్జి ఈఈ గనిరాజును వివరణ కోరగా.. ‘తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు పడిన గండిని తాత్కాలింగా పూడ్చేందుకు రూ.10 లక్షలు అవసరం. ఇందుకోసం అధికారులకు ప్రతిపాదనలు పాదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టి రైతులకు అవసరమైన సాగునీరును అందిస్తాం.’ అని తెలిపారు.