Share News

Malaria జ్వరాలు తగ్గట్లే.. మలేరియా వదలట్లే..!

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:13 AM

"Fevers Show No Signs of Easing; Malaria Still Persists!" జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాలు మంచం పట్టాయి. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వారితో ఎక్కువగా మలేరియా బాధితులే కనిపిస్తున్నారు. ఇద్దరు జ్వర పీడితులు డిశ్చార్జి అవుతుంటే.. మరో నలుగురు జ్వర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

 Malaria  జ్వరాలు తగ్గట్లే..  మలేరియా వదలట్లే..!
చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మలేరియా జ్వర పీడితులు

  • కేవలం 223 గ్రామాలకే పరిమితమైన పంపిణీ

  • పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు..

  • మరోవైపు విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

  • వణుకుతున్న గిరిజనులు

  • ఆసుపత్రులు కిటకిట

జియ్యమ్మవలస, జూలై9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాలు మంచం పట్టాయి. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వారితో ఎక్కువగా మలేరియా బాధితులే కనిపిస్తున్నారు. ఇద్దరు జ్వర పీడితులు డిశ్చార్జి అవుతుంటే.. మరో నలుగురు జ్వర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులే అధికంగా ఆసుపత్రిపాలవుతున్నారు. జిల్లా అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నా.. మలేరియా మాత్రం అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ పాజిటిల్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు హైరిస్క్‌ గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో దోమ తెరలు పంపిణీ జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో మొత్తం 15 మండలాలు, 2,364 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 40 శాతం కంటే ఎక్కువ గిరిజన గ్రామాలే ఉన్నాయి. అయితే పారిశుధ్య లోపం, ఇతరత్రా కారణాలతో గిరిపుత్రులకు దోమల బెదడ తప్పడం లేదు.

- సుమారు 779 ప్రాంతాలను మలేరియా ప్రభావిత గ్రామాలుగా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎనిమిది పీహెచ్‌సీల పరిధిలో 223 గ్రామాల ప్రజలకు మాత్రమే 26,339 దోమ తెరలను పంపిణీ చేశారు. మిగిలిన 556 మలేరియా ప్రభావిత గ్రామాలకు నేటికీ దోమ తెరలు పంపిణీ చేయలేదు. మొత్తంగా ఇప్పటివరకు కేవలం 28.6 శాతం మాత్రమే పంపిణీ జరిగింది.

- జిల్లాలో 37 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు, మూడు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా కేంద ఆసుపత్రి కలిపి మొత్తం 49 ఆసుపత్రులు ఉన్నాయి. వైద్యాధి కారులు, సిబ్బంది నిరంతర చికిత్స, పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాదిలో ఈ సమయానికి 1,318 జ్వర పీడితులు ఉండగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 550 కేసులు నమోదయ్యాయి.

- జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీలో గ్రామాలన్నీ మలేరియా ప్రభావిత ప్రాంతాలే. ఆయా గ్రామాల నుంచి జియ్యమ్మవలస , చినమేరంగి పీహెచ్‌సీలకు పదుల సంఖ్యలో మలేరియా బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ ఆయా గ్రామాల్లో దోమ తెరల పంపిణీ జరగలేదు.

- పీటీ మండ, టీకే జమ్ము, కొండ చిలకాం, అలమండ గిరిజన పంచాయతీల్లో కూడా కొన్ని గ్రామాల్లో మలేరియా బాధితులు ఉన్నా.. దోమ తెరలు పంపిణీ జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

- దీనిపై డీఎంవో డి.సూర్యనారాయణను వివరణ కోరగా.. ‘జిల్లాలోని మలేరియా ప్రభావిత గ్రామాల విషయం కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి దోమ తెరలు వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 12:13 AM