Share News

Fevers జ్వరాలు.. చంపేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:57 PM

Fevers Are Turning Fatal మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు మంచం పడుతున్నారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ జ్వరాలతో వ‌రుస‌గా విద్యార్థులు మృత్యువాత ప‌డుతుండ‌డం జిల్లావాసులను కలవరపరుస్తోంది.

Fevers  జ్వరాలు.. చంపేస్తున్నాయ్‌!

  • కలవరపరుస్తున్న విద్యార్థుల వరుస మరణాలు

  • ఈనెల 23న ఇద్దరు విద్యార్థులు మృత్యువాత

  • తాజాగా దుడ్డుకళ్లుకు చెందిన బాలుడి మృతి

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు మంచం పడుతున్నారు. మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ జ్వరాలతో వ‌రుస‌గా విద్యార్థులు మృత్యువాత ప‌డుతుండ‌డం జిల్లావాసులను కలవరపరుస్తోంది. సీతంపేట ఐటీడీఏ పరిధి మల్లి ఏపీఆర్‌ గురుకుల బాలుర పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జొనగ జగ్గడుగూడ గ్రామానికి చెందిన సవర దివాకర్‌(9) మలేరియాతో ఈ నెల 23న మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే నౌగూడ గ్రామానికి చెందిన సవర పూర్ణచంద్ర(17)అనే గిరిజన విద్యార్థి కూడా మలేరియా, పచ్చకామెర్లతో బాధపడుతూ మృతి చెందాడు. తాజాగా సోమవారం మరో విద్యార్థి జ్వరంతో మరణించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

గుమ్మలక్ష్మీపురం మండలం మారుమూల గిరిజన గ్రామం దుడ్డుకళ్లుకు చెందిన పాలక జస్టిన్‌(14) బొబ్బిలి సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థిని శనివారం ఆశ్రమ పాఠశాల నుంచి ఇంటికి పంపించారు. దీంతో ఇంటికి చేరిన జస్టిన్‌ ఆరోగ్యం ఆదివారం విషమించింది. జ్వరం, వాంతులు ఎక్కువవడంతో ఆ రోజు సాయంత్రం తల్లిదండ్రులు రాజు, జయసుధలు తమ కుమారుడిని కురుపాం సీహెచ్‌సీకి తరలించారు.. పరిస్థితి మెరుగవక పోవడంతో సోమవారం అక్కడి వైద్యులు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి రెఫర్‌ చేశారు. దీంతో హుటాహుటిన జస్టిన్‌ను పార్వతీపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రానికి విద్యార్థి మృతి చెందాడు. ప్లేట్‌లెట్స్‌ డౌన్‌ అవ్వడంతో చనిపోయినట్లు జిల్లాకేంద్రాసుపత్రి వైద్యుడు అవినాష్‌ తెలిపారు. కాగా నలుగురి సంతానంలో రెండో వాడైన జస్టిన్‌ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డ అకాల మృతిని తట్టుకోలేక భోరున విలపిస్తున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 11:57 PM