Share News

Fever ఏజెన్సీలో జ్వరాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:15 AM

Fever Cases Rise in Agency Areas మలేరియా, విషజ్వరాలతో సీతంపేట ఏజెన్సీ వణుకుతోంది. ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. చలిజ్వరం, వాంతులు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో మంచం పడుతున్నారు. మరోవైపు ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Fever ఏజెన్సీలో జ్వరాలు
జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న జొనగ సరిహద్దుగూడ గ్రామం

  • మంచం పట్టిన గిరిజనం

సీతంపేట రూరల్‌, జూన్‌16(ఆంధ్రజ్యోతి): మలేరియా, విషజ్వరాలతో సీతంపేట ఏజెన్సీ వణుకుతోంది. ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. చలిజ్వరం, వాంతులు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో మంచం పడుతున్నారు. మరోవైపు ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కుసిమి పీహెచ్‌సీ పరిధి ఎగువబుడగరాయి గ్రామానికి చెందిన సవర శైలజ జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు ఆమెను 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎగువ చీపురుగూడలో సవరధన్‌ అనే బాలుడు , జొనగ సరిహద్దుగూడలో సవర కుర్మయ్య, సుమిత్ర మలేరియాతో బాధపడుతూ పాలకొండ, సీతంపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రి, క్లీనిక్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. జొనగ సరిహద్దుగూడలోనే సవర సాత్విక్‌, అనిత, సిద్ధు, అనుశ్రీలతో పాటు తిక్కమ్మలు చలిజ్వరంతో మంచంపై మూలుగుతున్నారు. అయితే ఇంతవరకు తమ గ్రామాల వైపు వైద్యసిబ్బంది ఎవరూ రాలేదని జ్వరపీడితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేటు క్లీనిక్‌లో మలేరియా ట్రీట్‌మెంట్‌ కోసం రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని వాపో తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతిని వివరణ కోరగా.. జొనగ గ్రామంలో ఇటీవల కాలంలో వైద్య శిబిరం నిర్వహించామన్నారు. జ్వరాలపై వైద్యసిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జొనగ సరిహద్దుగూడకు వైద్య సిబ్బందిని పంపిస్తామని చెప్పారు.

Updated Date - Jun 17 , 2026 | 12:15 AM