Festive Splendorపండగ శోభ
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:38 PM
Festive Splendor ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి ప్రధాన ఘట్టమైన సిరిమాను, ఇరుసుమాను చెట్లకు సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జొన్నవలసలో రెండు చెట్లకు ఉదయం 8.36 గంటలకు ముహూర్తం ప్రకారం గొడ్డలితో గంటు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పండగ శోభ
సిరిమాను, ఇరుసుమాను చెట్లకు శాస్త్రోక్తంగా పూజలు
తొలగించే క్రతువులో విశేషంగా హాజరైన భక్తులు
పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
భక్తుల నీరాజనం మధ్య నగరానికి చేరిన సిరిమాను చెట్టు
విజయనగరం కల్చలర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి ప్రధాన ఘట్టమైన సిరిమాను, ఇరుసుమాను చెట్లకు సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జొన్నవలసలో రెండు చెట్లకు ఉదయం 8.36 గంటలకు ముహూర్తం ప్రకారం గొడ్డలితో గంటు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. జై పైడిమాంబ నామస్మరణలు, డప్పు, నాదస్వర వాయిద్యాల మధ్య సిరిమాను, ఇరుసుమానులకు పూజలు చేసి అనంతరం ప్రముఖులు గొడ్డలితో ఆయా చెట్లకు గంటు పెట్టారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష ఆధ్వర్యంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి దంపతులు చెట్టు వద్ద పూజలు అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న జన సందోహం మధ్య ఈ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమ్మవారి సిరిమాను ఉత ్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరుపున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారని ఈ నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఎప్పటిలాగే సాంప్రదాయ బద్ధంగా పైడిమాంబ పండుగను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సిరిమాను చెట్టు దాతలు బూర్లె శ్రీనివాసరావు, రవి, వారి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు రాజేష్‌బాబు, ఐవీపీ రాజు, అవనాపు విజయ్, సిరి సహస్ర తదితరులు పాల్గొన్నారు.
భారీ అన్నసమారాధన
సిరిమాను, ఇరుసుమాను చెట్ల తరలింపు ప్రక్రియలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జొన్నవలసలో భారీ అన్న సమారాధన జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జొన్నవలస రహదారిలో రాకపోకలు వేరే మార్గంలో మళ్లించారు. ఆపై సిరిమాను, ఇరుసుమాను చెట్లను మానులుగా మలిచి వాటిని నాటు బళ్లపై తీసుకువెళ్లేందుకు సిద్దం చేశారు. పోలీసు ఇతర శాఖల సమన్వయంతో జొన్నవలస నుంచి హుకుంపేట వరకూ సిరిమాను, ఇరుసుమాను తరలింపునకు ఏర్పాట్లు చేశారు.
దారిపొడవునా నీరాజనం
విజయనగరం మండలం జొన్నవలస నుంచి పైడిమాంబ సిరిమాను, ఇరుసుమానులను నాటుబళ్లపై హుకుంపేటకు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు మానులకు చల్లదనం చేసేందుకు మహిళలు దారిపొడవునా ఘాటాలతో స్వాగతం పలికారు. హారతులు ఇస్తూ ముందుకు సాగనంపారు. హుకుంపేటకు రాత్రి 8.30 గంటలకు చే రాయి.