Share News

Festive Sambhar తొలేళ్ల ‘శంబర’ం

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:10 AM

Festive Sambhar సంబరం మొదలైంది. భక్తజన సందడితో శంబర గ్రామం కళకళలాడుతోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కొంగు బంగారం శంబర పోలమాంబ జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్లు ఉత్సవాన్ని సోమవారం రాత్రి సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలతో పోలమాంబకు ప్రత్యేకపూజలు చేశారు.

 Festive Sambhar  తొలేళ్ల ‘శంబర’ం
శంబరలో పోలమాంబ ఘటాల తిరువీధి

  • నేడు శంబరలో సిరిమానోత్సవం

  • పోలమాంబ దర్శనానికి భారీగా తరలిరానున్న భక్తులు

  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మక్కువ రూరల్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): సంబరం మొదలైంది. భక్తజన సందడితో శంబర గ్రామం కళకళలాడుతోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కొంగు బంగారం శంబర పోలమాంబ జాతరలో తొలి ఘట్టమైన తొలేళ్లు ఉత్సవాన్ని సోమవారం రాత్రి సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలతో పోలమాంబకు ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి అక్షింతలు చల్లి... రైతులు ఏరుపూజ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలమాంబ చదురుగుడి నుంచి ఘటాలతో భక్తులు బయలుదేరారు. గ్రామంలో తిరువీధి పూర్తి చేసుకుని.. అర్ధరాత్రి 12గంటలకు గద్దె వద్దకు చేరుకున్నారు. అనంతరం ఉపవాసదీక్షలో ఉన్నవారు నాగలికి పూజ చేశారు. కాడెద్దుల్లా నిల్చొని వరి విత్తనాలను చేతబట్టి పోలమాంబను వేడుకున్నారు. ఆ తర్వాత వాటిని గ్రామస్థులకు అందజేశారు.. వాటిని ధాన్యంలో కలుపుకుని పొలంలో జల్లితే పంటలు బాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం. ఇక మంగళ వారం నిర్వహించనున్న సిరిమానోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది 40 అడుగుల సిరిమాను సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమవుతుందని ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. పూజారి జన్ని పేకాపు సుధ సిరిమానును అధిరోహించనున్నట్లు వెల్లడించారు. ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులు తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని వస్తారు. అనంతరం పూజారి సిరిమానును అధిరోహిస్తారు. అప్పటికి మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు వస్తాయి. దీంతో సిరిమాను గిరడ వారింటికి, అనంతరం కుప్పిలి, గ్రామ మున్సబు వారిళ్లకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఆ తర్వాత సిరిమాను పణుకువీధి, గొల్లవీధి, కొత్తవీధి, చదురుగుడి మీదుగా గాంధీనగర్‌ ప్రధాన వీధికి చేరుకుంటుంది. సాయంత్రం 6.30 గంటలకు సిరిమానోత్సవం ముగుస్తుంది. ఆ తర్వాత ఉపవాస దీక్షల్లో ఉన్న భక్తులు పూజారి జన్ని పేకాపు సుధను సిరిమాను నుంచి దించి చదురుగుడికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ శంబర గ్రామంలో పర్యటించారు. చదురుగుడి, వనంగుడిల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారు లను ఆదేశించారు. వారి వెంట ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చినతిరుపతి, ఈవో శ్రీనివాస్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:10 AM