Festive Fervour in Shambara శంబరలో సందడి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:15 AM
Festive Fervour in Shambara ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకుంది. దీంతో గ్రామంలో సందడి మొదలైంది. ఈనెల 26, 27, 28 తేదీల్లో జాతర నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆనవాయితీ ప్రకారం.. సోమవారం సాయంత్రం 6 గంటలకు చదురుగుడిలో పోలమాంబ ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు.
మక్కువ రూరల్, జనవరి12(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకుంది. దీంతో గ్రామంలో సందడి మొదలైంది. ఈనెల 26, 27, 28 తేదీల్లో జాతర నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆనవాయితీ ప్రకారం.. సోమవారం సాయంత్రం 6 గంటలకు చదురుగుడిలో పోలమాంబ ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, దేవాలయ సిబ్బంది గ్రామసమీపంలో గోముఖినది ఆవల ఒడ్డున ఉన్న అమ్మవారి గద్దెవద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పూజారి కుటుంబాకులు పసుపు కుంకుమలతో నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత పోలమాంబను గద్దె ఊరేగింపుగా శంబర గ్రామంలోకి తీసుకొచ్చారు. మహిళలు పెద్దఎత్తున చేరుకుని కుంకుమ పూజలు జరిపారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత పోలమాంబ చదురుగుడిలో కొలువుదీరింది. అమ్మవారి ఊరేగింపులో మేళతాళాలు, తప్పిటగుళ్లు, మహిళల కోలాటం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు యువత బాణసంచా కాల్చి సందడి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ చినతిరుపతి, దేవాలయం ఈవో బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.