పల్లెల్లో పండగ సందడి
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:52 AM
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
విజయనగరం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపు కున్నారు. గురువారం సంక్రాంతి, శుక్రవా రం కనుమ వేడుకలు అంబరాన్ని తాకా యి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి శ్రమజీవులు భారీగా స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో ప్రతి ఊరూ కళకళ లాడింది. అయితే ఈసా రి పండుగల్లో ఆటల పోటీలు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలు, రంగవల్లుల పోటీలు ఎక్కువగా నిర్వహించారు. కుటుంబాలన్నీ ఒకేచోట పండుగలు జరుపుకోవడం కూడా చాలాచోట్ల కనిపించింది.
ఖాళీగా రోడ్లు..
ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే విజయనగరంలో రోడ్లు కొంత వరకూ ఖాళీగా కనిపించాయి. అయితే పండుగ ప్రయాణాల రద్దీ మాత్రం కొనసాగింది. పండుగనాడు అంటే గురువారం మధ్యాహ్నం నుంచి షాపులు సైతం మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యం అయ్యాయి. శుక్రవారం సైతం అదే పరిస్థితి. వస్త్ర వ్యాపారానికి విజయనగరం పెట్టింది పేరు. నెల రోజులుగా క్రిస్మస్, సంక్రాంతి అమ్మకాలు జరిగాయి. రూ.1000 కోట్ల వరకు వ్యాపారాలు జరిగి ఉంటాయని అంచనా. అయితే సంక్రాంతి పూర్తి కావడంతో షాపులు మూతపడ్డాయి. సిబ్బందికి సెలవులు ఇచ్చారు. సోమవారం ఈ షాపులు తెరచుకోనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులుగా సెలవులు. శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే. మళ్లీ ఆదివారం ఉండడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సైతం సెలవులు కావడంతో ఆ ప్రాంగణాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
మాంసం మార్కెట్లు కిటకిట..
కనుమ అంటేనే మద్యం, మాంసం అన్నట్టు ఉంది. జిల్లాలో శుక్రవా రం పెద్దఎత్తున మద్యం అమ్మకాలు సాగాయి. మాంసం, చేపలను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడ్డారు. మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో రూ.300పైమాటే. స్కిన్‌లెస్ రూ.320కు చేరుకుంది. అయినా సరే అమ్మకాలు తగ్గలేదు. మరోవైపు నాటుకోళ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఎప్పుడూ 600 నుంచి 800రూపాయల వరకూ ఉండే వీటి ధరలు 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకూ పెరిగాయి. ఇక మటన్ ధర కూడా అమాంతంగా పెంచేశారు. కిలో మటన్ రూ.800 వరకూ ఉండేది. పండుగ పుణ్యమా అని రూ.1000 వరకూ పెంచి విక్రయించారు.
సంక్రాంతి వేడుకల్లో మంత్రి కొండపల్లి
గంట్యాడ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన స్వగ్రామమైన గంట్యాడలో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుక ల్లో పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌ఏ కేఏ నాయుడు, మాజీ ఎంపీపీ కొండ పల్లి కొండలరావు తదితరులతో కలిసి పూజలు చేశారు. అనంతరం తాటిపూడి రిజర్వాయిర్‌లో బోటు షికారు చేశారు.
కొత్తవలస, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని మంగళపాలెం గ్రామంలో గరువారం శివమాల ధారులు నాగసాధువుల వేషధారణతో పూజలు చేశారు. సంక్రాంతి పండగను పురష్కరించుకుని కొత్తవలస-విశాఖపట్నం ప్రధాన రహదారిలో మంగళపాలెం శివాలయం నుంచి 2 కిలోమీటర్ల వరకు మట్టితో తయారుచేసిన భారీ శివలింగాన్ని ఊరేగించారు. శివభక్తులు త్రిశూలాలు పట్టుకుని నాగసాధువుల వలే నృత్యాలు చేశారు. ముందుగా మంగళపాలెం సమీపంలోని కాశీ అన్నపూర్ణ సహిత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివ లింగానికి పూజలు చేశారు.
కొత్త అల్లుడికి 101 రకాల పిండి వంటలు
రామభద్రపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రామభద్రపురంలో ఓ కొత్త జంటకు 101 రకాల పిండి వంటలు వడ్డించారు. శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న బొడ్డు నాగసయిన, అత్తయ్య సత్య తమ అల్లుడు వెంకట సాయికుమార్, కుమార్తె పద్మావతికి మొదటి సంక్రాంతి పండగ సందర్భంగా ఈ మర్యాద చేశారు.
దిగొచ్చిన కొబ్బరి ధర..
విజయనగరం రూరల్, జనవరి 16: జిల్లాలో నిన్నటి వరకూ కొబ్బరి ధర కొండెక్కింది. ఒక్కటి రూ.50 వరకూ పలికింది. ప్రస్తుతం ఆ ధర సగానికి పడిపోయింది. కొబ్బరికాయ ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతోంది. నెల కిందట ఈ ధరలు చూసి భక్తులు బెంబేలె త్తిపోయారు. అప్పట్లో దిగుబడులు లేకపోవడం వల్ల ధరలు పెరిగినట్టు వ్యాపారులు పేర్కొన్నా రు. తాజాగా కొబ్బరి కాయ దిగుబడి గణనీయంగా ఉండడం, శీతాకాలం కావడంతో బొండాల వినియోగం తగ్గిపోవ డంతో ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. ఓ మోస్తరు సైజు కొబ్బరికాయ రూ.22 నుంచి రూ.30 పలుకుతోంది. ఒకప్పుడు ఈ ధర రూ.50 ఉండేది. ఇంకా తక్కువ సైజులో కొబ్బరికాయుల హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.15 నుంచి రూ.20 వరకు ఉంది.