Share News

ఎరువుల ధరలు పైపైకి..

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:34 AM

Fertilizer prices on the rise...ఎరువుల ధరలు గురించి విని రైతులు టెన్షన్‌ పడుతున్నారు. తయారీ కంపెనీలు ఈఏడాది రెండు పర్యాయాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఖరీఫ్‌ నుంచే కొత్త ధరలు అమల్లోకి తెచ్చాయి.

ఎరువుల ధరలు పైపైకి..

ఎరువుల ధరలు పైపైకి..

బస్తాపై రూ.550 వరకు పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువు

ముడి సరుకు లభ్యత తగ్గడమే కారణమా?

డీఏపీ, యూరియా ధర యథాతథం

సేంద్రియ వాడకంపై దృష్టిసారించాలంటున్న వ్యవసాయ అధికారులు

ఎరువుల ధరలు గురించి విని రైతులు టెన్షన్‌ పడుతున్నారు. తయారీ కంపెనీలు ఈఏడాది రెండు పర్యాయాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఖరీఫ్‌ నుంచే కొత్త ధరలు అమల్లోకి తెచ్చాయి. అత్యల్పంగా పొటాష్‌ పైనే రూ.125 పెంచారు. కాంప్లెక్స్‌ ఎరువుపై రకాన్ని బట్టి బస్తా వద్ద గరిష్టంగా రూ.550 ధర పెరిగింది. దీనివల్ల రైతులపై అదనపు భారం పడనుంది. డీఏపీ, యూరియా ధరలను కేంద్రం యథాతథంగా ఉంచింది. అమెరికా, ఇరాన్‌ యుద్ధం వల్ల ఎరువుల ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆ భారం కాంప్లెక్స్‌ ఎరువులపై పడింది.

విజయన గరం/ గజపతినగరం/ రాజాం, జూన్‌14(ఆంధ్రజ్యోతి):

ఖరీఫ్‌ సాగు ప్రారంభంలోనే ఎరువుల ధరలు రైతులకు దడ పుట్టిస్తున్నాయి. వర్షాలు ప్రారంభంకావడంతో రైతులు దుక్కులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వరి సాగుకు సిద్ధమవుతున్నారు. యూరియా, డీఏపీ మినహా రైతులు అత్యధికంగా వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచక తప్పడంలేదని ఎరువుల తయారీ కంపెనీలు చెబుతున్నాయి. కేంద్రం అదనపు సాయం ఇస్తుందని ఆశించాయి. ఇప్పటికే నిర్దిష్టమైన రాయితీని ఇస్తున్నామని, ఆపైన ఎంత పెరిగినా కంపెనీలే భరించాలని కేంద్రం చెబుతోంది. దీంతో చేసేదిలేక కంపెనీలు ముడి సరుకుల ధర పెరిగిందంటూ ఎరువుల ధరలను పెంచుతున్నాయి. ఈసారి గరిష్ఠ స్థాయిలో ధరలు పెరగడంతో రైతులపై భారం పడనుంది. ప్రస్తుతానికి జిల్లాలో డీఏపీ, యూరియా నిల్వలు ఉన్నాయి. ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతో డీఏపీ వినియోగం ఎక్కువగా ఉంటుందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా 91,214 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు జరుగనుంది. 41వేల 810 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతగా 12,500 టన్నుల ఎరువులు రైతులకు ఇస్తామని, ఆగస్టు నెలలో మొదటివిడతగా అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పెరిగిన ఎరువుల ధరలు ఇలా..

ఎరువు పాతధర కొత్తధర పెంచినధర

12-32-16 రకం 1,900 2,450 550

14-35-14 ( గ్రోమోర్‌) 1,900 2,350 450

24-24-0 (కాంప్లెక్స్‌, ఫెర్టిలైజర్స్‌) 2,000 2,450 450

10-26-26 1,950 2,450 500

20-20-0-13 (అమ్మోనియో, పాస్పేట్‌, సల్పేట్‌ ) 1,800 2,150 350

16-16-16 (కాంప్లెక్స్‌, ఫెర్టిలైజర్స్‌) 1,675 2,050 375

15-15-15-09 (కాంప్లెక్స్‌, ఫెర్టిలైజర్స్‌) 1,650 1,950 300

16-20-0-13 (అమ్మోనియో, పాస్పేట్‌) 1,400 2,000 600

ఎంపోవా (కాంప్లెక్స్‌ ఎరువు) 1,850 1,975 125

ఎస్‌ఎస్‌పీ (పొటాష్‌) 615 1,000 385

మితిమీరిన ఎరువులతో అనర్థం

అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల అనర్థమే. ఖరీఫ్‌ సాగులో ఎరువుల యాజమాన్యం అత్యంత కీలకం. భూసార పరీక్షల ఆధారంగా నేల పరిస్థితిని బట్టి వీటిని వినియోగిస్తే ఆశించిన ఫలితాలు సాధించుకోవచ్చు. మితిమీరిన ఎరువుల వినియోగంతో ఆరోగ్యంతో పాటు దిగుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రధానంగా కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగంలో రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. ఎకరం పొలానికి 5సెంట్ల విస్తీర్ణంలో నారుమడి తయారు చేసుకోవాలి. విత్తనాలు చల్లిన తరువాత నాలుగు కిలోల డీఏపీ, 2కిలోల యూరియా, కిలో పొటాష్‌ కలిపి వేస్తే ఆకు ఏపుగా పెరుగుతుంది. అలాగే మొదటి దమ్ములో 3బస్తాల సపర్‌ బస్తా డీఏపీ, ఊడ్చేముందు 35 కిలోల యూరియా, 12కిలోల పొటాష్‌ కలిపి వాడాలి. పొలం ఊడ్చిన 45 రోజల తరువాత 45కిలోల యూరియా, 12కిలోల పొటాష్‌ వేసుకోవాలి. పొట్టదశలో మరో 35కిలోల యూరియా, 15కిలోల పొటాష్‌ కలిపి వాడాలి. 60 రోజుల వ్యవధిలో 35కిలోల యూరియా, 15కిలోల పొటాష్‌ చొప్పున వేసుకుంటే మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

సేంద్రీయ ఎరువులపై దృష్టిసారించాలి

తక్కువఖర్చుతో మంచి ఫలితాలను ఇచ్చే సేంద్రీయ ఎరువులపై రైతులు దృష్టిసారించాలని అధికారులు సూచిస్తున్నారు. మితిమీరిన రసాయన ఎరవుల వాడకంతో అనారోగ్యంతో పాటు నేల నిస్సారం అయిపోతుంది. కొద్దిగా కష్టమైనా తక్కవ ఖర్చుతో నాణ్యమైన సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. పంటపొలంలో దమ్ము చేయడానికి 15 రోజులకు ముందు పశువులపెంట(గెత్తం) జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట ఎరువులు వాడితే భూమి సారవంతమై అధిక దిగుబడులు వస్తాయి. వీటి వినియోగంతో భవిష్యత్‌లో కూడా భూసారం తగ్గకుండా ఉంటుంది.

ఎరువుల ధరలు ఈ ఖరీఫ్‌ నుంచి అమలు

పెరిగిన ఎరువుల ధరలు ఈ ఖరీఫ్‌ నుంచే అమల్లోకి రానున్నాయి. ఎరువుల వాడకం మోతాదు మించకూడదు. సేంద్రియ ఎరువుల వాడకం పెంచి రసాయిన ఎరువుల వాడకం తగ్గించుకోవాలి. దీనివల్ల పంటల దిగుబడి సాధించుకోవచ్చు. సేంద్రియ ఎరువులవాడకంపై రైతులు దృష్టిసారించాలి. ఇందుకు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

- వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

----------------

Updated Date - Jun 15 , 2026 | 12:34 AM