సంతానోత్పత్తి తగ్గుతోంది
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:29 PM
జిల్లాలో చాలామంది దంపతులు సంతానానికి నోచుకోవడం లేదు.
- పిల్లలకు నోచుకుని ఎందరో దంపతులు
- జిల్లాలో పడిపోతున్న జననాల రేటు
- జీవన శైలి మార్పులే కారణమంటున్న వైద్య నిపుణులు
- గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి 8 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటి వరకూ సంతానం కలగలేదు. పిల్లల కోసం చాలా మంది డాక్టర్ల చుట్టు తిరిగినా ఫలితం లేదు. దీనివల్ల ఈ దంపతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
- విజయనగరం పట్టణంలోని ఓ ఫార్మాసీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగికి ఆరు సంవత్సరాల కిందట పెళ్లయింది. ఇంత వరకూ పిల్లలు కలగకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులతో పాటు పక్క జిల్లాల్లోని ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించారు. సంతానం కోసం మందులు వాడుతున్నా ఉపయోగం ఉండడం లేదు. దీనివల్ల వారు ప్రతిరోజూ మానసిక క్షోభకు గురవుతున్నారు.
విజయనగరం, కలెక్టరేట్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలామంది దంపతులు సంతానానికి నోచుకోవడం లేదు. పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు మాత్రం కలగడం లేదు. ఎన్ని ఆస్పత్రులు చుట్టు తిరుగుతున్నా, వైద్య కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. దీనివల్ల కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు సమాధానం చెప్పలేక లోలోపన బాధపడుతున్నారు. ప్రధానంగా కరోనా తరువాత సంతాన్పోత్పత్తి తగ్గుతోంది. ఎక్కువగా ఫార్మసీ, స్టాఫ్ట్‌వేర్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వీరు మంచి పేరు ఉన్న డాక్టర్లను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. మన తాతల కాలంలో ముగ్గురు నుంచి పది మంది వరకూ పిల్లలను కనేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మరోవైపు సంతాన్పోత్పత్తిని పెంచాలంటూ సీఎం చంద్రబాబునాయుడు పిలుపుని చ్చారు. ముగ్గురు నలుగురు పిల్లలను కనాలంటూ కోరారు. చాలా మంది సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టడం లేదన్న భావన ఉంది. గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో క్రమంగా జననాల రేటు తగ్గుతూ వస్తుంది. మరోవైపు మధ్య, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువ మంది పిల్లలు పుడితే పెంచే శక్తి ఉండదని భయంతో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో ప్రజల్లో చైతన్యం వస్తుందా? లేదా చూడాలి.
గత ఐదేళ్లలో జిల్లాలో జననాల రేటు
సంవత్సరం పుట్టిన పిల్లలు జననాల రేటు
2021-22 25,681 10.64
2022-23 31,049 14.99
2023-24 28,071 13.53
2024-25 24,424 12.36
2025-26 22,318 11.29
జీవన శైలి మార్పులే కారణం
ప్రస్తుత కాలంలో భార్యాభర్తల్లో ఇన్‌ఫెర్టిలిటీ (సంతాన లేమి) రేటు వేగంగా పెరగడానికి ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. కెరీర్‌లో స్థిరపడాలనే ఆలోచనతో పెళ్లిళ్లను ఆలస్యం చేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానం కోసం ప్లాన్ చేయడంతో సహజంగానే గర్భధారణ అవకాశాలు తగ్గుతున్నాయి. చాలామంది స్త్రీలలో శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరిగి, థైరాయిడ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వల్ల అండాల విడుదలను దెబ్బతీస్తోంది. జంక్‌ఫుడ్, ప్లాస్టిక్ కంటైనర్ల వాడకంతో పాటు పురుషుల్లో ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ అలవాటు ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తున్నాయి. కెరీర్ ఎంత ముఖ్యమో? సరైన వయసులో సంతానం ప్లాన్ చేసుకోవడం, ఆరోగకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం అలవర్చుకోవడం అంతే ముఖ్యం.
డాక్టర్ బీవీ రవిచంద్ర (గైనకాలిజిస్ట్, విజయనగరం)
1111111111111111111111111