Share News

హెల్మెట్‌ కిందపడి.. మృత్యుఒడి చేరి..

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:19 AM

అందరూ రాజాం జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు. కొన్ని నెలల్లో ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకుంటారు. ఇంటర్నిషిప్‌ కోసం విశాఖకు వెళ్లారు.

హెల్మెట్‌ కిందపడి.. మృత్యుఒడి చేరి..

  • ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ద్విచక్రవాహనం

  • ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

  • విజయనగరం జిల్లా విద్యార్థికి తీవ్రగాయాలు

  • భీమిలి దొరతోట కూడలిలో రోడ్డు ప్రమాదం

అందరూ రాజాం జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు. కొన్ని నెలల్లో ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకుంటారు. ఇంటర్నిషిప్‌ కోసం విశాఖకు వెళ్లారు. అక్కడ ఓ గెస్ట్‌ హౌస్‌లో బస చేశారు. సోమవారం సాయంత్రం ఇద్దరు బైక్‌ మీద బయటకు వెళ్లారు. కనెక్టివిటీ రోడ్డు చేరే క్రమంలో సిటీ బస్సు కుడివైపు ఢీకొట్టారు. బస్సు ముందు టైరుకింద పడ్డారు. వీరిలో ఒకరి హెల్మెట్‌ కిందపడడంతో అక్కడికక్కడే చనిపో యారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు.

భీమునిపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి దొరతోట కూడలిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 15 మంది విద్యార్థులు నగరంలోని ఓ హోటల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వచ్చారు. వీరంతా భీమిలిలోని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెందుర్తికి చెందిన ఆర్‌. గౌతమ్‌ (22), విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన పి.రవికిరణ్‌ (21) బైక్‌పై నేరేళ్లవలస ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డులో అమితవేగంగా వస్తున్నారు. దొరతోట రోడ్డును క్రాస్‌ చేస్తూ, తాళ్లవలస ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు చేరే క్రమంలో విశాఖ నుంచి భీమిలి వస్తున్న 999 మెట్రో సిటీ బస్సు కుడివైపు భాగాన్ని ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ బస్సు ముందు టైరు కింద పడిపోయారు. దీంతో బస్సు సుమారు పది మీటర్ల దూరం బైక్‌ను ఈడ్చుకుని పోయింది. బైక్‌ను నడుపుతున్న గౌతమ్‌ హెల్మెట్‌ కిందపడి తలకు తీవ్ర గాయమవడంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన రవికిరణ్‌కు ఆరిలోవలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇతడి స్వగ్రామం విజయనగరం జిల్లా తెర్లాం, గంగమ్మపాడు అని పోలీసులు తెలిపారు. గౌతమ్‌ మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రమాదంపై ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు ఎస్‌ఐ సురేశ్‌ దర్యాప్తు చేస్తున్నారని సీఐ దివాకర్‌ యాదవ్‌ తలిపారు. కాగా మెట్రోబస్సు, బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. వాల్తేరు డిపో మేనేజర్‌, విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు తీసుకువచ్చిన కాంట్రాక్టర్‌ స్టేషన్‌కు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారని సమాచారం.

Updated Date - Aug 12 , 2026 | 12:19 AM