Share News

Elephants గజరాజులతో భయం.. భయం!

ABN , Publish Date - May 04 , 2026 | 10:55 PM

Fear of Elephants Everywhere… Panic All Around! గరుగుబిల్లి, భామిని మండలాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆయా ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 15 రోజులుగా గరుగుబిల్లి మండలంలో సంచరిస్తూ పలు రకాల పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు ఆదివారం సుంకి, తోటపల్లి, నందివానివలస గ్రామాల్లో హల్‌చల్‌ చేశాయి.

 Elephants గజరాజులతో భయం.. భయం!
ఘనసర, తాలాడ మధ్య సంచరిస్తున్న ఏనుగుల గుంపు

గరుగుబిల్లి/భామిని, మే4(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి, భామిని మండలాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆయా ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 15 రోజులుగా గరుగుబిల్లి మండలంలో సంచరిస్తూ పలు రకాల పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు ఆదివారం సుంకి, తోటపల్లి, నందివానివలస గ్రామాల్లో హల్‌చల్‌ చేశాయి. సోమవారం సంతోష పురం చేరుకుని.. ఏడు ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. వరి, పామాయిల్‌ పం టలను కూడా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. నష్టం వాటిల్లిన పంటలను పరిశీలించి పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. ఇక భామిని మండలంలోని ఆవిలమ్మ తోట నుంచి ఘనసర పొలాలకు వెళ్లే రహదారిలో ఏనుగులు సంచరించడంతో రైతులు బెంబేలెత్తిపోయారు. గజరాజుల గుంపు ఎప్పుడు.. ఎక్కడ ఉంటాయో తెలియక ఘనసర, కీసర, కోసలి, తాలాడ గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - May 04 , 2026 | 10:55 PM