fear in ycp cader వైసీపీలో కలవరం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:08 AM
fear in ycp cader వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలకనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఇది తమకు ఊహించని షాకేనని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చిన్న శ్రీను పార్టీని వీడడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
వైసీపీలో కలవరం
చిన్న శ్రీను పార్టీని వీడడంతో పార్టీలో నైరాశ్యం
స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందని ఆందోళన
గందరగోళంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు
విజయనగరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలకనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఇది తమకు ఊహించని షాకేనని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చిన్న శ్రీను పార్టీని వీడడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పరాభవం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరిసహస్ర మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే ఇప్పటికే వైసీపీ నాయకులు ఏమీ మాట్లాడలేక పోతున్నారు. మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు చిన్నశ్రీను అంటే ఎవరో తెలియదు. ప్రస్తుతం జిల్లాలో ఆయన మేనమామ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కంటే ఈయనే ఎక్కువగా పేరు సంపాదించారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తానే చొరవ తీసుకుని మెజార్టీ స్థానాలను గెలిపించి జడ్పీ పీఠాన్ని కాంగ్రెస్ వశం చేశారు. తన బావ బడ్డుకొండ అప్పలనాయుడిని జడ్పీ చైర్మన్ చేశారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ, ప్రభుత్వ పాలనలో తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు. అప్పటివరకు తెరవెనుక ఉన్న చిన్న శ్రీను 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయల్లోకి అడుటుపెట్టారు. మెరకముడిదాం మండలం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ ఏకగ్రీవం అయ్యారు. 34 మంది జడ్పీటీసీలతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా పదవి చేపట్టారు. వైసీపీ హయాంలో మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నా.. జిల్లాలో అన్నీ తానై నడిపించేది మాత్రం చిన్న శ్రీను. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం చిన్నశ్రీను నాయకత్వంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యేవి. ప్రస్తుతం అంతటి కీలక నాయకుడు పార్టీని వీడివెళ్లిపోవడంతో నాయకులు, కార్యకర్తలు కోలుకోలేక పోతున్నారు.
- చిన్న శ్రీను టీడీపీలో చేరినప్పుడు వారి వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, పార్టీ రాష్ట్రఉపాఽధ్యక్షుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు, ఎమ్మెల్యేలు కోళ్లలలిత కుమారి, అదితి, బే బీనాయన, కోండ్రు మురళీ, ఎమ్మెల్సీ గ్రీష్మ, మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు తదితరులు ఉన్నారు.
బొత్స ప్రకటనే కారణమా?
చిన్న శ్రీను రాజీనామా చేయడానికి కారణం ఏంటి అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. ప్రస్తుతం ఆయన జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. తన కుమార్తె డాక్టర్ అనూష విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో ఉంటారని ప్రకటించారు. అయితే అప్పటికే చిన్న శ్రీను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా తన కుమార్తె సిరి సహస్రను నిలబెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కనీసం తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా బొత్స ప్రకటించేసరికి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలిసింది. అందుకే రాజీనామా చేసినట్టు ఒక ప్రచారం ఉంది. అయితే బొత్స కుటుంబం కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం ఉంది. కానీ బొత్స దానిని నేరుగా, బలంగా ఖండించలేదు. దీంతో అనుమానం అలానే ఉంది. ఇంతలో చిన్నశ్రీను ట్విస్టు ఇచ్చారు.