fear in schools! బడుల్లో బిక్కుబిక్కు!
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:22 AM
fear in schools! పాఠశాల ప్రహరీ కూలి ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల కిందట అనంతపురం జిల్లాలో హాస్టల్ గోడ కూలి మరో విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలు, హాస్టళ్ల భవనాల దుస్థితికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో కూడా అలాంటి ప్రమాదకర స్థితిలో అనేక పాఠశాలలు, వసతిగృహాల భవనాలు, ప్రహరీలు ఉన్నాయి.
బడుల్లో బిక్కుబిక్కు!
శిథిల భవనాల్లో విద్యార్థుల చదువులు
ప్రమాదంలో ప్రహరీలు
‘ఆంధ్రజ్యోతి విజిట్’లో అనేక ఆసక్తికర అంశాలు
విజయనగరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల ప్రహరీ కూలి ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల కిందట అనంతపురం జిల్లాలో హాస్టల్ గోడ కూలి మరో విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలు, హాస్టళ్ల భవనాల దుస్థితికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో కూడా అలాంటి ప్రమాదకర స్థితిలో అనేక పాఠశాలలు, వసతిగృహాల భవనాలు, ప్రహరీలు ఉన్నాయి. పెచ్చులూడిన శ్లాబులు... పగిలిన గోడలు... ఊడిన తలుపులు, కిటికీలు.. ఊచలు కనిపిస్తున్న స్తంభాలు.. అనేక చోట్ల ప్రస్ఫుటమవుతున్నాయి. వాటిల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు కాని, చదువుకుంటున్న విద్యార్థులు కాని అనేక అవస్థలు పడుతున్నారు. శ్లాబు పెచ్చులూడి విద్యార్థులు గాయాలపాలైన ఘటనలు జిల్లాలో కోకొల్లలు. గత ప్రభుత్వం నాడు-నేడు పనులతో ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదు. శిథిల భవనాలను గాలికొదిలేసింది. జిల్లా వ్యాప్తంగా 116 పాఠశాలల్లో అనేక తరగతి గదులు శిథిలావస్థకు చేరినట్టు అధికారులు గుర్తించారు. కానీ వాటిలోనే ప్రస్తుతం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను ఆంధ్రజ్యోతి విజిట్ చేయగా ఎన్నో లోపాలు, సమస్యలు కనిపించాయి.
విరిగిన శ్లాబ్.. గోడ
గజపతినగరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మల్లునాయుడు పేటలోని ప్రైమరీ స్కూలు శిథిలావస్థకు చేరుకుంది. ఒక ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థులతో పాఠశాల నడుస్తోంది. స్లాబ్ ముందుభాగం కొంత విరిగిపోయింది. ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గోడ కూడా సగం కూలిపోయింది. గట్టిగా వర్షాలు పడితే కుప్పకూలిపోతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో ప్రహరీ
మెరకముడిదాం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మండలంలో 13 పాఠశాలలకు ప్రహరీ లేదు. అలాగే 12 పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. సిరియాలపేట పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఉండగా పాఠశాల పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారైంది. ప్రహరీ పాడై కొంతభాగం కూలిపోయింది. పతివాడపేట పాఠశాలలో ఐదుగురు ఉండగా శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. సోమలింగాపురం పాఠశాల భవనాలు శిఽథిలమయ్యాయి. బిక్కుబిక్కుమంటూ తరగతులు నిర్వహిస్తున్నారు.
నిర్మించి రెండు దశాబ్దాలు
రేగిడి, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): మండలంలో మూడు పాఠశాలల భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి. అప్పాపురం ప్రాథమిక పాఠశాల, చిన్నశిర్లాం యూపీ పాఠశాలల భవనాలు శిథిలదశలో ఉండగా దేవుదల హైస్కూల్ ప్రహరీ ఎప్పుడు కూలుతుందోనని పిల్లలు భయపడుతున్నారు. ఇది రెండు దశాబ్దాల కిందట నిర్మించినది. చిన్నశిర్లాంలో రెండు భవనాలు పాడవ్వగా ఒక భవనంలో పాఠశాల మధ్యాహ్న భోజనం వంటలు నిర్వహిస్తున్నారు.
పొంచి ఉన్న అపాయం
రాజాం రూరల్, ఆగష్టు 26(ఆంధ్రజ్యోతి): విజయరాంపురం పాఠశాలలో ఐదు తరగతుల్లో 18 మంది విద్యార్థులున్నారు. భవనం పూర్తిగా శిథిలమైంది. గోడలు బీటలువారి ప్రమాదాన్ని శంకిస్తున్నాయి. బాత్రూంల దుస్థితి మరింత భయానకంగా మారింది. గొల్లలపేట పాఠశాల పరిస్థితి కూడా ఇంతే.
భయం..భయంగా చదువులు
రాజాం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కంచరాం ఎస్సీ వీధిలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడు కూలిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. పైకప్పు పెచ్చులూడుతుండడంతో విద్యార్థులూ వణుకుతున్నారు. వంటగది పూర్తిగా శిథిలమైంది.
ఏ క్షణమైనా పడిపోయేలా
బొబ్బిలి రూరల్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మోసూరువలస గిరిజన ప్రాథమిక పాఠశాలలో 37 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు ఏక్షణమైనా పడిపోవచ్చు అన్నట్టుగా తయారయ్యాయి. పైకప్పు, తలుపులు, గోడలదీ అదే పరిస్థితి.
భయపెడుతున్న బడి భవనం
మెంటాడ, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): మెంటాడ స్కూల్లో ఏడుగురు విద్యార్థులు ఉండగా భవనం స్లాబు పాడైంది. పెచ్చులు ఊడిపోతున్నాయి. గచ్చులు పాడయ్యాయి. వర్షంపడితే నరకయాతనే. పదేళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన ఈ పాఠశాల భవనం సంపూర్తిగా నిలిచిపోయింది.
ట్యాంకరుతో పొంచి ఉన్న ప్రమాదం
బొబ్బిలి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మల్లమ్మదేవి మున్సిపల్ పాఠశాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. మున్సిపాలిటీకి చెందిన తాగునీటి ట్యాంకరు ఈ పాఠశాల ఆవరణలోనే ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. ఇటీవల పాఠశాల మహిళా టీచర్‌పైనా రిజర్వాయరు శ్లాబ్ పెచ్చులు పడ్డాయి. త్రుటిలో ఆమెకు ప్రమాదం తప్పింది.
చినుకుపడితే చెమ్మే
బొండపల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): దేవుపల్లి బీసీ బాలికల వసతి గృహం, బొండపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ భవనాలు శిథిలమవుతున్నాయి. చినుకుపడితే చెమ్మ చేరిపోయి వర్షాకాలంలో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. బొండపల్లిలో 54మంది, దేవుపల్లి బాలికల వసతి గృహలో 13 మంది విద్యార్థులు ఉంటున్నారు.