Fear Grips YSRCP వైసీపీలో వణుకు
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:52 PM
Fear Grips YSRCP ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలోకి చేరడంతో మన్యం జిల్లా వైసీపీలో కలవరం మొదలైంది. పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి వెళ్లిపోకుండా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడకుండా ముందస్తు చర్యలు
నియోజకవర్గాల్లో సమావేశాలకు సన్నద్ధం
పార్వతీపురం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలోకి చేరడంతో మన్యం జిల్లా వైసీపీలో కలవరం మొదలైంది. పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి వెళ్లిపోకుండా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వాస్తవంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో చిన్నశ్రీనుకు సొంత కేడర్ ఉంది. కొన్నేళ్లుగా వైసీపీ ప్రథమ, ద్వితీయ శ్రేణులతో ప్రత్యేక అనుంబంధం ఉంది. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా ఆయన కనుసన్నల్లోనే ఉందనే మాట వినిపిస్తోంది. అయితే ఇప్పుడు చిన్నశ్రీను హఠాత్తుగా టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఆ స్థాయి నాయకులు లేరనే మాట ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఏదేమైనా ఆయన వైసీపీని వీడడం ఆ పార్టీకి భారీ నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరిగిన గత స్థానిక ఎన్నికల్లో చిన్నశ్రీను పాత్ర ఎంతో ఉంది. ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్లే అత్యధిక స్థానాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలతో, సర్పంచ్ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అయితే కొద్దిరోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా చిన్నశ్రీను వైపు మొగ్గుచూపితే వైసీపీకి భారీ నష్టం తప్పదు. అందుకే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పార్వతీపురం నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులతో బుధవారం మాజీ ఎమ్మెల్యే జోగారావు సమావేశమయ్యారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీ నుంచి ఎవరూ వెళ్లరని ఆశిస్తున్నట్లు ప్రసంగించారు. మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా టీడీపీలోకి వెళ్లకుడా ఆ పార్టీ అధిష్ఠానం ముందస్తుగా కసరత్తు చేస్తోంది.
- జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన ప్రతి జడ్పీటీసీ, ఎంపీపీతో చిన్నశ్రీనుకు ప్రత్యేక అనుంబంధం ఉంది. వారి సిఫారుసుల మేరకు జడ్పీ ద్వారా అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో ఏ చిన్న పని అవ్వాలన్నా.. ఆ పార్టీ నాయకులు ఆయన్ని ఆశ్రయించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ శ్రేణులకు చిన్నశీను అండగా నిలిచేవారు. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కూడా చిన్నశ్రీనుకు బలమైన రాజకీయ బంధముంది. ప్రఽథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు అప్పటి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన అడుగుజాడల్లోనే నడిచే వారు. అటువంటి నాయకుడు టీడీపీ వెళ్లిపోవడంతో ఆయనతో రాజకీయ అనుబంధం ఉన్న వారంతా కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు.
- ఏదేమైనా చిన్నశ్రీను చేరికతో ఉమ్మడి జిల్లాలో టీడీపీకి మరింత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టం కనిపించనుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.