Father’s Heart Stops కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:22 AM
Father’s Heart Stops After Losing His Son తన తర్వాత ఇంటికి పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు మరణ వార్తను ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఆరోగ్యం కుదటపడేవరకూ స్వగ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనుకున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
మరణంలోనూ వీడని బంధం
ఎల్‌ఎల్‌పురంలో విషాదచాయలు
పాలకొండ, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): తన తర్వాత ఇంటికి పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు మరణ వార్తను ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఆరోగ్యం కుదటపడేవరకూ స్వగ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనుకున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ విషాద ఘటన పాలకొండ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఎల్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన సింహాచలం, సీతమ్మల వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. కాగా వారి పెద్దకుమారుడు రమణ తన భార్య రామలక్ష్మి, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి విశాఖపట్నంలో ఉంటున్నాడు. అక్కడ రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. భార్య సాయంతో ఆసుపత్రికి వెళ్లాడు. కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆరోగ్యం కుదుటపడే వరకు గ్రామంలో ఉందామను కున్నాడు. ఈ మేరకు తన నాలుగేళ్ల కుమార్తెను విశాఖలోని తన సోదరుడు చిన్న ఇంటిలోనే విడిచిపెట్టి.. మంగళవారం మధ్యాహ్నం భార్యతో కలిసి స్వగ్రామానికి పయనమయ్యాడు. విశాఖ నుంచి పాలకొండలో బస్సులో బయల్దేరగా.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రమణ విజయనగరం వచ్చేప్పటికి మృత్యువాత పడ్డాడు. దీంతో భార్య రామలక్ష్మి భోరున విలపించింది. అయితే ప్రయాణికులు ఆమెను సముదాయించడంతో గుండెల్లోనే బాధను దిగమింగుకుని.. పాలకొండకు చేరుకుంది. మృతదేహంతో కొద్దిసేపు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనే ఉంది.. తమ గ్రామస్థులు ఎవరైనా కనిపిస్తారా? అని వెతికింది. కొద్దిసేపటి తర్వాత ఎల్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన ఓ మహిళ పరిస్థితిని గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో సింహాచలం, సీతమ్మలు హుటాహుటిన పాలకొండకు పయనమయ్యారు. అప్పటికే మరో ఆటోలో రమణ మృతదేహాన్ని ఎక్కిస్తుండగా.. తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆటోలో విగతజీవిగా పడి ఉన్న పెద్ద కుమారుడుని చూసి తండ్రి సింహాచలం తట్టుకోలేకపోయాడు. రమణ ఒడిలోనే మృతి చెందాడు. అయితే గంటల వ్యవధిలోనే తండ్రీ కొడుకు మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ వారు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు స్వగ్రామం ఎల్‌ఎల్‌పురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతుఒడిలోకి చేరుకోవడంతో గ్రామస్థులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను చూడకుండానే రమణ మృతి చెందడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం సింహాచలం, రమణ మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.