Where Is the Son? తెల్లారితే తండ్రి పెద్దకర్మ.. కొడుకు ఏమయ్యాడో?
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:16 AM
Father’s Final Rites Tomorrow… Where Is the Son? తండ్రి చనిపోయి 12 రోజులు కావస్తోంది. తెల్లారితే పెద్దకర్మ. అయితే ఇంతలో ఆ కొడుకు ఏమయ్యాడో తెలియని పరిస్థితి. అప్పులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పెద్దగెడ్డ వద్ద ఆ లేఖ లభ్యమవడంతో ఆ వ్యక్తి జలాశయంలో దూకి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు సందేహిస్తున్నారు. ఈ మేరకు మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పెద్దగెడ్డ జలాశయంలో దూకినట్లు అనుమానం
కొనసాగుతున్న గాలింపు చర్యలు
మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు
పాచిపెంట రూరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తండ్రి చనిపోయి 12 రోజులు కావస్తోంది. తెల్లారితే పెద్దకర్మ. అయితే ఇంతలో ఆ కొడుకు ఏమయ్యాడో తెలియని పరిస్థితి. అప్పులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పెద్దగెడ్డ వద్ద ఆ లేఖ లభ్యమవడంతో ఆ వ్యక్తి జలాశయంలో దూకి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు సందేహిస్తున్నారు. ఈ మేరకు మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం పాచిపెంట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కొత్తవలస గ్రామానికి చెందిన చింతా వీరరాజు (44) మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో బొంతలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కుమార్తెకు ఏడాది కిందట వివాహం జరిగింది. కుమారుడు అగ్నివీర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వీరరాజు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం పెద్దకర్మ చేయాల్సి ఉంది. కాగా ఎప్పటిలానే ఉదయం ఏడు గంటల సమయంలో బొంతలు పట్టుకుని ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయల్దేరాడు. 11 గంటలు అయినా ఇంటికి చేరలేదు. ఆయన బైక్ పెద్దగెడ్డ జలాశయం గట్టుపై ఉండడాన్ని గమనించిన కొంతమంది ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అప్పులబాధ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీరరాజు ద్విచక్ర వాహనంపై లేఖ లభించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెద్దగెడ్డ జలాశయంలోకి దూకి వీరరాజు ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అనుమానంతో పోలీసులు స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. వీరరాజు భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎల్.అర్జున్ తెలిపారు.