Share News

Farming with drones... truly excellent. డ్రోన్‌తో సాగు.. బహు బాగు

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:18 AM

Farming with drones... truly excellent. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాగులో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 100 వరకూ డ్రోన్లు సాగు సేవలో ఉన్నాయి. డ్రోన్ల వల్ల సమయం కూడా ఆదా అవుతోంది. కూలీల కొరత తీరుతోంది. ఆపై పెట్టుబడి కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం వరకూ రాయితీపై డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్‌ దీదీ’ కార్యక్రమం కింద డ్రోన్లను అందించనుంది. మహిళా సంఘ సభ్యులకు రాయితీపై ఇవ్వనుంది.

Farming with drones... truly excellent. డ్రోన్‌తో సాగు.. బహు బాగు

డ్రోన్‌తో సాగు.. బహు బాగు

కేంద్రం ‘నమో డ్రోన్‌ దీదీ’కి శ్రీకారం

మహిళా సంఘ సభ్యులకు రాయితీపై అందజేత

సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాగులో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 100 వరకూ డ్రోన్లు సాగు సేవలో ఉన్నాయి. డ్రోన్ల వల్ల సమయం కూడా ఆదా అవుతోంది. కూలీల కొరత తీరుతోంది. ఆపై పెట్టుబడి కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం వరకూ రాయితీపై డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్‌ దీదీ’ కార్యక్రమం కింద డ్రోన్లను అందించనుంది. మహిళా సంఘ సభ్యులకు రాయితీపై ఇవ్వనుంది.

రాజాం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి):

సాంకేతికత, చదువు తదితర అంశాలపై అవగాహన ఉండి..వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వం డ్రోన్లను అందిస్తోంది. వీటిపై 80 శాతం రాయితీ ఇస్తోంది. డ్రోన్లు కావాలని కొత్తగా జిల్లాలో 50 మంది వరకు ముందుకొచ్చారు. ముఖ్యంగా రసాయనాలు, ఎరువుల పిచికారీ సమయంలో ఇబ్బందికర సమస్యలను వీటి ద్వారా అధిగమించవచ్చు. లేనిపోని రుగ్మతలు ఎదురుకావు. అనారోగ్య పరిస్థితుల కారణంగానే రసాయనాలను పిచికారీ చేసేందుకు కూలీలు అధిక కూలి అడుగుతున్నారు. అదే డ్రోన్లతో అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పని కానిచ్చేయవచ్చు. ఎకరా పొలంలో పది నిమిషాల్లోనే స్ర్పే అయిపోతుంది.

భారీగా రాయితీ..

సాధారణంగా రైతు కుటుంబాల నుంచి కూడా స్వయం సహాయక మహిళా సభ్యులు ఉంటారు. అటువంటి వారికి ఈ పథకం ప్రయోజనకరం. డ్రోన్‌ రూ.10 లక్షల వరకూ ఉంటుంది. కానీ రూ.2 లక్షలకే అందిస్తారు. ప్రభుత్వ రాయితీ రూ.8 లక్షలు ఉంటుంది. లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.2 లక్షలను కూడా బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఎంపికైన మహిళలకు 15 రోజుల పాటు శిక్షణనిస్తారు. వారి కుటుంబసభ్యుడికి మెకానిక్‌గా, డ్రోన్‌ అసిస్టెంట్‌గా ఐదు రోజుల పాటు శిక్షణనిస్తారు.

చిన్న, సన్నకారు రైతులే..

ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 4.26 లక్షల ఎకరాలు, రబీలో 2.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. మొత్తం 3.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మూడొంతుల మంది చిన్నసన్నకారు రైతులే. వీరి కుటుంబాల్లో స్వయం సహాయక సభ్యులు ఉంటారు. అటువంటి వారంతా డ్రోన్లు పొందవచ్చు.

అయితే సాధారణంగా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేసుకోలేరు. గతంలో టీడీపీ ప్రభుత్వం 70 శాతం రాయితీపై పంట కోత యంత్రాలు, 50 శాతం సబ్సిడీపై స్ర్పేయర్లు, బరకాలను అందించేది. ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండడంతో సాగు పెట్టుబడులు, మదుపులు తగ్గేవి. కానీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతుభరోసా అందిస్తున్నామని ఒకే ఒక కారణం చెప్పి రాయితీ పథకాలకు మంగళం పలికింది. అప్పట్లో డ్రోన్లు అందిస్తామని హడావుడి చేశారు. కానీ అందించలేకపోయింది. కూటమి ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు డ్రోన్లను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రైతులదే.

కూలీల కొరత లేకుండా..

ప్రస్తుతం సాగులో పెట్టుబడులు పెరిగాయి. కూలీల ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి. మదుపులు గురించి చెప్పనవసరం లేదు. ఎకరా పొలంలో క్రిమిసంహారక మందులు, ఎరువుల పిచికారీకి అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.2వేలు. అదే డ్రోన్ల ద్వారా చాలా తక్కువలో అయిపోతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు డ్రోన్ల సాయంతో సస్యరక్షణ చేపడుతున్నారు. డ్రోన్‌తో రోజుకు పది ఎకరాల్లో సస్యరక్షణ చేపట్టవచ్చు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. మహిళలను భాగస్వామ్యం చేస్తూ ‘డ్రోన్‌ దీదీ’ పథకాన్ని ప్రారంభించింది.

డ్రోన్లతో ఎంతో మేలు

సాగులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. జిల్లాలో కూడా ప్రోత్సహిస్తున్నాం. స్వయం సహాయక సంఘ సభ్యలకు డ్రోన్లు మంజూరు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నమో దీదీ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. భారీగా రాయితీ కూడా కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి.

- శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం

--------------

Updated Date - Aug 17 , 2026 | 12:18 AM