Farming కాలానుగుణంగా ‘సాగు’తూ..
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:16 AM
Farming in Tune with the Seasons జిల్లాలో ఒకప్పుడు చెరకు సాగుకు కేరాఫ్‌గా నిలిచిన సీతానగరంలో ఇప్పుడు ఆయిల్‌పామ్ తోటలు దర్శనమిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా రైతులు ప్రత్నామ్నాయ పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకుంటున్నారు.
పలు కారణాలతో చెరకు పంటకు దూరం
ప్రభుత్వ రాయితీతో పామాయిల్ విస్తరణ
సీతానగరం, జూన్16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకప్పుడు చెరకు సాగుకు కేరాఫ్‌గా నిలిచిన సీతానగరంలో ఇప్పుడు ఆయిల్‌పామ్ తోటలు దర్శనమిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా రైతులు ప్రత్నామ్నాయ పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకుంటున్నారు. గతంలో సీతానగరం ప్రాంతంలో వరి, చెరకు ప్రధాన పంటలుగా ఉండేవి. ముఖ్యంగా చెరకు సాగు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా ఉండేది. అయితే కాలక్రమంలో చెరకుపై డిమాండ్ తగ్గడం, షుగర్ ప్యాక్టరీ మూసివేత, సాగు వ్యయాలు పెరగడం వంటి కారణాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం సీతానగరం మండలంతో పాటు పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పామాయిల్ సాగు విస్తరిస్తోంది. భూసారవంతమైన నేలలు, సాగునీటి సౌకర్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధరలు రైతులను ఈ పంట వైపు ఆకర్షిస్తున్నాయి. గతేడాది జిల్లాలో రైతులు సుమారు నాలుగు వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టారన్నారు. ఈ ఏడాది సుమారు ఆరు వేల ఎకరాల్లో పంట సాగవునున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాయితీలతో ప్రోత్సాహం
పామాయిల్ సాగు చేస్తున్న ప్రతి రైతుకు రెండు నర్సరీల ద్వారా రాయితీతో కూడిన పామాయిల్ మొక్కలను అందిస్తున్నామని ఉద్యానశాఖ అధికారి వై.ప్రత్యూష తెలిపారు. ఎకరాకు 125 మొక్కలు, వాటి నిర్వహణ కోసం రూ.5,250 ఇస్తున్నామన్నారు. అంతర పంటలు ఒక భాగ మని, వాటివల్ల బహు ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు.
ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నాం
గతంలో అప్పయ్యపేట, బొబ్బిలిలో చక్కెర పరిశ్రమలు ఉండేవి. ఆ తర్వాత లచ్చయ్యపేటలో ఏర్పాటు చేసిన చక్కెర కర్మాగారం మూతపడడంతో గత్యంతరం లేక పామాయిల్ ప్రత్యామ్నా యంగా ఎంచుకున్నాం.
- బలగ శ్రీరాం, రైతు, పెదంకలాం
===============================
ప్రభుత్వ ప్రోత్సాహంతో..
ఒకప్పుడు వరితో పాటు చెరకు సాగు చేసేవాళ్లం. చెరకు పరిశ్రమ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల అన్ని విధాలా నష్టపోయాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పామాయిల్ సాగు అనుకూలం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుండడంతో ఈ పంట సాగు చేపడుతున్నాం.
- ఎస్‌హెచ్‌వీఎస్ విజయస్వామి, రైతు, సీతానగరం