Fair Prices ధర లేక దిగాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:09 AM
Farmers in Distress Due to Lack of Fair Prices సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతుల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అటవీ ఫలసాయాల దిగుబడి ఎక్కువగానే ఉంది. మరోవైపు డిమాండ్ అధికంగా ఉన్నా గిట్టుబాటు ధర మాత్రం ఉండడం లేదు.
కోల్డ్‌స్టోరేజ్ లేక అవస్థలు
నష్టపోతున్న గిరిజన రైతులు
సీతంపేట రూరల్, జనవరి14(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతుల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అటవీ ఫలసాయాల దిగుబడి ఎక్కువగానే ఉంది. మరోవైపు డిమాండ్ అధికంగా ఉన్నా గిట్టుబాటు ధర మాత్రం ఉండడం లేదు. వారపుసంతల్లో ఈ వారం ఉన్న ధర తరువాత వారానికి ఉండడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. వారపుసంతల్లో మైదాన వ్యాపారులు సిండికేట్‌గా మారి అటవీ ఉత్ప త్తులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- సీతంపేట ఏజెన్సీలో అధికశాతం మంది గిరిజనులు అటవీ ఫలసాయాలే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ఏడాది పొడవునా సీజనల్ వారీగా పంటలను పండించి వారపుసంతల్లో విక్రయిస్తుంటారు. జీడి, మామిడి, పైనాపిల్, అరటి, పెండ్లం, పుల్లదబ్బ, నారింజ, చెట్టుపనస, కొండచీపుర్లు, సీతాఫలం, నిమ్మ, గుమ్మడి వంటి పంటలు ఎక్కువగా పండిస్తుంటారు.
- గిరిజనులు అత్యధికంగా సాగు చేసే కొండచీపుర్లకు కొన్నేళ్లుగా ధర పెరగడం లేదు. మార్కెట్‌లో డిమాండ్ కూడా తగ్గింది. అదేవిధంగా వారపుసంతల్లో పనసకాయ కేజీ రూ.30 మాత్రమే పలుకుతోంది. గత ఏడాదిలో ఒక్కో పనసకాయ ధర రూ.40 నుంచి 45వరకు పలికింది. ఇక గుమ్మడికాయలు, పెండ్లం, నిమ్మ, పుల్లదబ్బ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.
- గిరిజన రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలు, అటవీ ఉత్పత్తులు, ఫలసాయా లను నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. దీంతో దిగుబడి బాగున్నా.. వారికి నష్టాలు తప్పడం లేదు. పంటలకు గిట్టుబాటు ధర రాకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో నష్టానికే వ్యాపా రులకు విక్రయిం చాల్సి వస్తోంది. ఇదే సమయంలో దళారులు రంగ ప్రవేశం చేసి గిరిజన రైతులను దోపిడీ చేస్తున్నారు.
- సీతంపేట ఐటీడీఏ పరిధిలో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అయినా దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి సీతంపేటలో కోల్డ్‌స్టోరేజ్‌ను నిర్మించి, వారపుసంతల్లో దళారుల దందాను అరికట్టాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
ఏపీవో ఏమన్నారంటే..
‘గిరిజన రైతుల నుంచి సేకరించే అటవీ ఉత్పత్తులు, ఫలసాయాలను నిల్వ చేసుకునేందుకు సీతంపేట వారపుసంత సమీపంలో రూ.కోటితో టీఎంఎంసీ(ట్రైబల్ మార్కెటింగ్ మల్టీపర్పస్ సెంటర్) పనులు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణాలు పూర్తయితే గిరిజన రైతులు వారి పంటలను స్టోర్ చేసుకునే వీలుకలుగుతుంది. తద్వారా దళారీ వ్యవస్థను అరికట్టవొచ్చు. ’ అని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు తెలిపారు.