Farmer Welfare రైతు సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:47 PM
Farmer Welfare is the Top Priority రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ సమీపంలోని చెముడు రోడ్డులో సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మక్కువ రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ సమీపంలోని చెముడు రోడ్డులో సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎద్దులకు పూజలు చేసి.. నాగలి పట్టి రైతులతో కలిసి దుక్కిదున్నారు. విత్తనాలు జల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. సాగు పెట్టుబడుల కోసం ఏటా మూడు విడ తల్లో రైతు ఖాతాలో నిధులు జమ చేస్తుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ రైతులు నాణ్యమైన విత్తనాలను సడ్సిడీపై పొందొచ్చని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయశాఖాధి కారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా మక్కువరోడ్డులో విస్తరణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. అందుకు తగ్గట్లుగా ఖరీఫ్ రైతులు పంటల సాగు చేపట్టాలన్నారు. మోతాదుకు మంచి యూరియాను వాడరాదన్నారు. మట్టి పరీక్షల నమూనా ఆధారంగా ఎరువులను వాడుకోవాలని సూచించారు. ఏపీఎఐఎంఎస్ యాప్ ద్వారా సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమకు కావాల్సిన ఎరువులను ఓటీపీ ఆధారిత గుర్తింపుతో రైతుసేవా కేంద్రాల్లో పొందొచ్చన్నారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పంణీలో ఎటువంటి ఇబ్బందులున్నా సంబంధిత శాఖాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి, ఆర్డీవో కె.మాధురి, డీఏవో భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.