పాము కాటుతో రైతు మృతి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:08 AM
అప్పలంపేట గ్రామానికి చెందిన సాకేటి నాగభూషణరావు(52) అనే రైతు గురువారం సాయంత్రం పాము కాటుకు గురై మృతి చెందాడు.
తెర్లాం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అప్పలంపేట గ్రామానికి చెందిన సాకేటి నాగభూషణరావు(52) అనే రైతు గురువారం సాయంత్రం పాము కాటుకు గురై మృతి చెందాడు. ఎస్‌ఐ సాగర్‌బాబు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నాగభూషణ రావు తన పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. గట్టుకి బొంగ పడి (రంధ్రం) నీరు పోతుండడంతో రంధ్రాన్ని కాలుతో తొక్కాడు. దీంతో ఆ రంధ్రంలో ఉన్న నాగుపాము ఆయన కాలుకు కాటు వేసింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు చికిత్స కోసం ఆయన్ను ఆటోలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పడంతో అక్కడ నుంచి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగభూషణరావుకు భార్య కృష్ణవేణి, వివాహితుడైన కుమారుడు సాయి ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.