Share News

కుటుంబాల ఆదాయం రెట్టింపు కావాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:17 PM

ప్రతీ కుటుంబం సుస్థిర ఆదాయం పెంచుకునేలా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 కుటుంబాల ఆదాయం రెట్టింపు కావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతీ కుటుంబం సుస్థిర ఆదాయం పెంచుకునేలా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రగతిపై అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలనే లక్ష్యంతో మహిళా సంఘాలు పని చేయాలన్నారు. ‘వృథా ఖర్చులను తగ్గించుకోవడమే వ్యాపారం లేదా కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మొదటి సూత్రం. పొదుపు చేసిన ప్రతీ రూపాయి ఆదాయంగా మారుతుంది. రుణాలను ఆదాయం పెంచే ఉత్పాదక వ్యాపారాలపై వినియోగించాలి. జిల్లాలోని ప్రతి కుటుంబ ఆదాయం రెట్టింపు కావాలి. రూ.5 లక్షల ఆదాయాన్ని సముపార్జించాలి. రాబోయే తరాలవారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించే జిల్లా ఆసుపత్రి సేవలతోపాటు మీ ఇంటి డాక్టర్‌, టెలీ హబ్‌ ద్వారా డాక్టర్‌ సలహాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలి. సాధారణ ప్రసవాల్లో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఎక్కడా లేని విధంగా జిల్లాలో 3వేల వైద్య శిబిరాలను నిర్వహించాం. లాభసాటిగా ఉండే బహుళ పంటల సాగు విధానాల వైపు రైతులు ఆలోచించాలి. జిల్లాలో సుమారు 90 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. మిగిలినవారు కూడా లాభసాటి పంటలు వేసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి. తృణధాన్యాలతో ఒక ప్రొసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పబోతున్నాం. సిరి ధాన్యాల ద్వారా తయారైన పదార్ధాలను నాణ్యమైన ప్యాకింగ్‌తో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులతో పాటు 25 ఏళ్లు నిండిన వారు డిగ్రీ పూర్తి చేసేలా దూర విద్యను అందుబాటులోకి తెచ్చాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విద్యావంతులు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-ఆటోలను మంజూరు చేయబోతున్నాయి. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది.’ అని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ప్రభావతి, సీసీలు, వీవోఏలు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియన్‌ కళాశాల క్రీడామైదానంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు, స్వయం సహయక సంఘాలు, వనధన్‌ వికాస్‌ కేంద్రాల సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, యువత, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి నుంచి చర్చి వీధి కూడలి మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు గిరిజన కళారూపాలతో భారీ శోభాయాత్ర నిర్వహించాలని పీవో ఆర్‌.వైశాలీ అధికారులను ఆదేశించారు. అడవి తల్లి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, గిరిజన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రధాన ఆకర్షణగా నిలవాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Updated Date - Aug 06 , 2026 | 11:17 PM