Share News

Crop Insurance పంటల బీమా గడువు పెంపు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:21 PM

Extension of Crop Insurance Deadline పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం పెంచింది. శనివారంతో ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో ఖరీఫ్‌ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వరి ఉబాలు ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి.

  Crop Insurance  పంటల బీమా గడువు పెంపు
రైతులు సాగు చేస్తున్న వరి పంట

గరుగుబిల్లి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం పెంచింది. శనివారంతో ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో ఖరీఫ్‌ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వరి ఉబాలు ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి. మరోవైపు సాగునీరు సౌకర్యం అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాల్లో వరి ఎదలను సాగు చేశారు. బీమా ప్రీమియం చెల్లింపు కూడా ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా నిర్ణయించారు. జిల్లాకు సంబంధించి వరికి ఎకరాకు రూ.800, మొక్కజొన్నకు రూ. 330గా ప్రీమియం చెల్లించాల్సి ఉండడంతో బీమా నమోదు ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు సర్వర్‌ సమస్య కూడా తోడవడంతో నిర్దేశించిన సమయానికి లక్ష్యాలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పీఎం ఫసల్‌ బీమా యోజన నమోదు గడువును మరోసారి పెంచారు. జిల్లాలోని 28,888 హెక్టార్లలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు.ఇందులో వరి 16,610 హెక్టార్లు, మొక్కజొన్న 5,470 హెక్టార్లు, పత్తి 4,824 హెక్టార్లు, చిరుధాన్యాలు 1,191 హెక్టార్లతో పాటు 738

హెక్టార్లలో పలు రకాల పంటలు సాగవుతున్నాయి. వరికి ఎకరాకు రూ. 800 చొప్పున ప్రీమియంగా చెల్లిస్తే పరిహారంగా రూ. 40 వేలు చెల్లిస్తారు. అదేవిధంగా మొక్కజొన్నకు ఎకరాకు రూ. 330 చొప్పున ప్రీమియం చెల్లిస్తే రూ. 33 వేలు పరిహారంగా అందుతుంది. ఇదిలా ఉండగా రైతులకు సంబంధిత బ్యాంకుల్లో రుణాలు ఉంటే బీమా మొత్తాన్ని బ్యాంకులు బీమా కంపెనీకి జమ చేస్తారు. పంట రుణం తీసకోలేని వారు సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌)లో గాని, సమీపంలోని మీసేవ కేంద్రాల్లో నమోదుతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైతులకు బీమా సౌకర్యాన్ని టాటా ఏఐజీ మోడల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 6 వేలకు పైగా రైతులు 4 వేల హెక్టార్లకు పైబడి బీమా చేయించుకున్నారు.

సమాచారం అందించాం

మండలాల్లోని వ్యవసాయాధికారులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ అధికారులకు బీమా గడువు పెంపుపై సమాచారం అందించాం. బ్యాంకు అధికారులకు సూచనలు చేశాం. పూర్తిస్థాయిలో బీమా నమోదుకు దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశాం. ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఆర్థికంగా నష్టాలబారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో లక్ష్యాలు చేరుకునే విధంగా దృష్టి సారిస్తున్నాం.

- టి.భవానీశంకర్‌, డీఈవో, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 16 , 2026 | 11:21 PM