ఫీజుల మోత
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:10 AM
జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒకటో తరగతికే రూ.50వేలు ఫీజు తీసుకుంటున్నాయి.
- ఒకటో తరగతికే రూ.50వేలు
- ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ
- పుస్తకాలు, యూనిఫాంకు అదనంగా..
- పాఠశాలల ఆవరణలోనే విక్రయాలు
- అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం
- రాజాంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో ఓ విద్యార్థి ఏడో తరగతిలో చేరాడు. స్కూల్ ఫీజు రూ.75వేలు అని యాజమాన్యం చెప్పింది. తగ్గదా? అని విద్యార్ధి తల్లిదండ్రులు అడిగితే మంచి చదువు కావాలంటే ఈ ఫీజు చెల్లించాల్సిందేనని యాజమాన్యం తెగేసి చెప్పింది.
- గంట్యాడ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థి పుస్తకాల కోసం తల్లిదండ్రులు రూ.6వేలు చెల్లించారు. యూనిఫాం, బెల్టు, బూట్లు తదితర వాటి కోసం మరికొంత చెల్లించారు. పుస్తకాల రేటు ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు అంటే.. తప్పదని స్కూల్ యాజమాన్యం చెప్పింది.
- విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో రెండు జతల యూనిఫాంకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇదే యూనిఫాం బయట షాపులో రూ.1700కు దొరుకుతుంది. స్కూల్‌లో మాత్రం ఇందుకు మూడింతలు వసూలు చేస్తుండడంపై తల్లిదండ్రులు సంబంధిత యాజమాన్యంను ప్రశ్నించినా ప్రయోజనం లేదు.
- ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థ వద్ద ఫీజులకు సంబంధించిన బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో అందులో స్పష్టంగా రాయాలి. అంత కంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేయరాదు.
-ఇటీవల విద్యాశాఖ అధికారుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
విజయనగరం కలెక్టరేట్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒకటో తరగతికే రూ.50వేలు ఫీజు తీసుకుంటున్నాయి. మొదట అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.2వేల నుంచి రూ.10వేల వరకు లాగేస్తున్నాయి. ఆ తరువాత ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, స్మార్ట్ క్లాసులు.. ఇలా ఫీజులు చిట్టా విప్పి వేలాది రూపాయలను దోచుకుంటున్నాయి. కొత్తగా అడ్మిషన్ తీసుకుంటే రెగ్యులర్ ఫీజుతో పాటు అదనపు భారాన్ని మోయాల్సిందే. అతి కష్టం మీద ఈ ఫీజులు చెల్లించిన తరువాత పుస్తకాలు, యూనిఫాం, షూలు, అట్టలు ఇలా వాటి జాబితా కూడా చాంతాడంత ఉంటోంది. దీనిపై విద్యార్థి సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండడం లేదు. జిల్లాలో 448 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 98,283 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, చాలా పాఠశాలల్లో నిబంధనలు పాటించడం లేదు. ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు.. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు.. పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? తదితర సౌకర్యాల వివరాలను తల్లిదండ్రులకు కనిపించేలా బోర్డులో ప్రదర్శించాలి. పాఠశాలలో వసూలు చేసే ఫీజులన్నిటికీ రసీదులు ఇవ్వాలి. ఇలా పలు రకాల నిబంధనలు ఉన్నాయి. కానీ, ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు పాఠ్యపుస్తకాలకు రూ.6వేలు నుంచి రూ.12వేలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు కాకుండా ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియంటెడ్ పేరుతో విక్రయాలు చేపడుతూ వాటినే బోధిస్తున్నాయి. వాస్తవానికి ఆయా పుస్తకాలు ధరలు బయట రూ.వెయ్యి ఉంటే స్కూల్‌లో మాత్రం రూ.4వేలకు విక్రయిస్తున్నారు. యూనిఫాం రెండు జతలు బయట మార్కెట్‌లో రూ.2వేల లోపు ఉంటే పాఠశాలల్లో మాత్రం రూ.5వేలకు అమ్ముతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని ఆదేశాలు ఇచ్చాం. ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా పుస్తకాలు, యూనిఫాం విక్రయించరాదు. ఎక్కడైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
-యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం