Excellent Teachers ఉత్తమ గురువులు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:57 PM
Excellent Teachers ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గురువారం ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. కాగా జిల్లాకు చెందిన ముగ్గురు గురువులు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పార్వతీపురం రూరల్/వీరఘట్టం/కొమరాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గురువారం ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. కాగా జిల్లాకు చెందిన ముగ్గురు గురువులు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి లో శనివారం జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వీరు అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక కావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వారు తెలిపారు.
వీరఘట్టం మండలంలోని నీలానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూరు సతీష్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గురువారం విడుదలైన ఉత్తమ గురువుల జాబితాలో ఆయన పేరు ఉండడంతో మండల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. 2005లో ఎస్‌జీటీగా ఆయన కలిగాం మండల పరిషత్ పాఠశాలలో ఉద్యోగంలో చేరారు. 2012 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించారు. అనంతరం వీరఘట్టం మండలం నడిమికెల్ల ప్రాథమికోన్నత పాఠశాల, అక్కడ నుంచి నీలానగరం జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గణితాన్ని బోధిస్తూ అంకిత భావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆయన తాజాగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఎంఈవోలు డి.గౌరునాయుడు, ఆనందరావు, టీచర్లు అభినందించారు.
ఇక పార్వతీపురం మండలం ఎంఆర్ నగరం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయకుమార్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. బోధనతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్ తదితర కార్యక్రమాల్లో అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
కొమరాడ మండలం సీతామాంబపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్‌గా పనిచేస్తున్న వనజాక్షి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2002, అక్టోబరులో అంటివలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. ఆ తర్వాత కూనేరు, తులసివలస గిరిజన గ్రామాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే సవర భాషను నేర్చుకుని విద్యార్థులకు బోధించేవారు. యాక్టివిటీ, టాయ్‌బేస్డ్ పద్ధతుల్లో చిన్నారులకు అర్థమయ్యేలా పాఠ్యాంశా లను బోధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్లాస్టిక్ నిరోధానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం తన సేవలను గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.