Excellent in development అభివృద్ధిలో భేష్
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:24 AM
Excellent in development కీలక అంశాల్లో జిల్లా మెరుగ్గా ఉంది. అభివృద్ధి అంశాల్లో గతం కంటే భిన్నమైన పంథాలో ముందుకెళ్తోంది. అనేక అంశాల్లో పనితీరు సూచికలో (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్) జిల్లాకు సముచిత స్థానం దక్కింది.
అభివృద్ధిలో భేష్
కేపీఐలో జిల్లాకు మూడో స్థానం
జోన్‌లో ఏ ఫ్లస్ గ్రేడు
జిల్లా ప్రగతిని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివరించిన కలెక్టర్
విజయనగరం/ కలెక్టరేట్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కీలక అంశాల్లో జిల్లా మెరుగ్గా ఉంది. అభివృద్ధి అంశాల్లో గతం కంటే భిన్నమైన పంథాలో ముందుకెళ్తోంది. అనేక అంశాల్లో పనితీరు సూచికలో (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్) జిల్లాకు సముచిత స్థానం దక్కింది. నెల రోజుల వ్యవధిలో జిల్లా పని తీరును పరిశీలించిన ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. అందులో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జోన్ (శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఆనకాపల్లి, విశాఖ, విజయనగరం)లో ఏ గ్రేడ్ ప్లస్ సాధించింది. ఐదు జిల్లాల్లో విజయనగరం జిల్లాకు 92 స్కోరుతో ఏ ప్లస్ గ్రేడు లభించింది.మరోవైపు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక రంగంలో 93, సామాజిక రంగంలో 93 , పాలనలో 83 స్కోర్లు నమోదు చేసుకుంది. మొత్తం 165 కేపీఐ సూచికల్లో జిల్లా 87 స్కోర్‌తో ఏగ్రేడ్ సాధించింది.
- రాజధాని అమరావతిలో 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం మొదలైంది. జిల్లా నుంచి కలెక్టర్ రామసుందర్ రెడ్డి హాజరై జిల్లాలో ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించారు. ఎల్‌నినో పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి పసల్ బీమా పథకం ద్వారా పంటలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రత్యామ్నాయ, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల నిధులు సమర్థంగా వినియో గించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అంగన్‌వాడీ, పోషణ్ 2.0, సమగ్ర శిక్ష, ఉద్యానవనాలు, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ తదితర పథకాలకు ఇప్పటి వరకూ రూ.52 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. జిల్లాలోని పాలు, మాంసం ఉత్పత్తి, పరిశ్రమలు, విద్యుత్ వినియోగం, పర్యాటకం, పిల్లలకు టీకాలు వేయడం, ప్రీ స్కూల్ హాజరు వంటి అంశాల్లో మెరుగైన స్థితిలో ఉండగా, స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వెనుకబడి ఉన్న రంగాలపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలు సాధించాలని సీఎం సూచనలు ఇచ్చారు. రీవ్యూ చేయడం కాదు, ఫలితాలు కావాలంటూ సీఎం సూచించారు.
వ్యవసాయం, జీవనోపాధి రంగంలో వృద్ధి
2026-2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు రూ.1900 కోట్లకు చేరింది. 2025-2026 తొలి త్రైమాసికంలో రూ.1700 కోట్లతో పోలిస్తే 11.81 శాతం వృద్ధి నమోదైంది.
గృహ నిర్మాణంలో పురోగతి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాలో 78,080 ఇళ్ల నిర్మాణం చేపట్టగా ,57,443 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 20191 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం ప్రారంభించిన ఇళ్లలో 74 శాతం పూర్తయ్యాయి.
పారిశుధ్య పరిరక్షణలో ముందంజ
జిల్లా పారిశుధ్య పరిరక్షణలో ముందంజలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి చెత్త సేకరణ 99.56 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో 4,44,25 కుటుంబాలకు గాను 4,42,135 కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది.
తాగునీటి వసతులు
జిల్లాలో 1438 గ్రామీణ తాగునీటి పథకాల పనుల్లో 1,202 పనులు పూర్తయ్యాయి. అంటే 83.59 శాతం పురోగతి నమోదైంది. జిల్లాకు రోజుకు 94.38 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉండగా, ప్రసుత్తం 87.64 ఎంఎల్‌డీ నీటి సరఫరా జరుగుతోంది.
విద్యుత్, డిజిటల్ కనెక్టవిటీ
జిల్లాలో 6,04,334 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 36,245 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుదీకరణ 100 శాతం నమోదైంది. గ్రామ పంచాయతీల డిజిటల్ కనెక్టవిటీ 99.7 శాతం ఉన్నాయి.
పెట్టుబడులకు మంచి అవకాశాలు
జిల్లాలో ఏపీఐఐసీ పరిఽధిలో ప్రాజెక్టుల కోసం 3820 ఎకరాలు అవసరం కాగా 120 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాజెకుల్లో రూ.24,476 కోట్ల పెట్టుబడితో 11,177 మంది ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
విమానాశ్రయం రాకతో కొత్త రూపు
జిల్లాలో భోగాపురంలో ఏర్పాటు చేసిన అల్లూరిసీతారామరాజు విమానాశ్రయంతో కొత్తరూపు వచ్చింది. ఎయిర్‌పోర్టును రూ.20 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. 60 వేల ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
------------------