Share News

Excellence in Cleanliness! స్వచ్ఛతలో భేష్‌!

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:40 PM

Excellence in Cleanliness! అదొక గిరిజన గ్రామం.. అక్కడ ఉన్నవి 60 ఇళ్లే.. సుమారు 300 మంది నివసిస్తున్నారు. ఆ గ్రామంలో గిరిజనులందరికీ కొండ పొడు వ్యవసాయమే ఆధారం. అయితేనేం.. పారిశుఽధ్యం, తాగునీరు, ప్లాస్టిక్‌ నిషేధం తదితర అంశాల్లో ఆదర్శంగా నిలుస్తూ.. జిల్లాలో తొలి ‘ముస్తాబు’ గ్రామంగా ఎంపికైంది బియ్యాలవలస.

Excellence in Cleanliness! స్వచ్ఛతలో భేష్‌!
బియ్యాలవలస గ్రామం

  • ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన గ్రామస్థులు

  • కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌ ప్రశంసలు

కురుపాం రూరల్‌, ఫిబ్రవరి3(ఆంధ్రజ్యోతి): అదొక గిరిజన గ్రామం.. అక్కడ ఉన్నవి 60 ఇళ్లే.. సుమారు 300 మంది నివసిస్తున్నారు. ఆ గ్రామంలో గిరిజనులందరికీ కొండ పొడు వ్యవసాయమే ఆధారం. అయితేనేం.. పారిశుఽధ్యం, తాగునీరు, ప్లాస్టిక్‌ నిషేధం తదితర అంశాల్లో ఆదర్శంగా నిలుస్తూ.. జిల్లాలో తొలి ‘ముస్తాబు’ గ్రామంగా ఎంపికైంది బియ్యాలవలస. అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రశంసలు కూడా అందుకుంది. మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని ఇప్పుడు ఎంతోమంది సందర్శిస్తున్నారు. షెడ్యూల్డ్‌ నోటిఫైడ్‌ ఏరియా కిందకు వచ్చే ఈ గిరిజన గ్రామంలో ఎటుచూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడున్న నాలుగు వీధుల్లో అత్యధికంగా గిరిజనులే నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వారంతా ఐక్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామస్థులందరదీ ఒకే మాట. రచ్చబండపై గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ గ్రామంలో చదువుకున్న వారు, ఉద్యోగులు ఎక్కువగానే ఉన్నారు. వారికి సమాజంపై ఎంతో అవగాహన ఉంది. ప్రకృతి , సేంద్రియ సాగులోనూ గిరిజన గ్రామస్థులు రాణిస్తున్నారు.

పరిశుభ్రతకు పెద్దపీట..

బియ్యాలవలస గిరిజన గ్రామస్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇంటి ముందు భాగాన్ని రోజూ శుభ్రంగా కడిగి కల్లాపు వేసి ముగ్గులు వేస్తారు. గ్రామంలో ఎక్కపడితే అక్కడ చెత్తాచెదారం వేయరు. రోడ్లు, వీధులను శుభ్రంగా ఉంచుతారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయరు. గ్రామంలో ఎక్కడా మురుగునీటి నిల్వ లేకుండా చూసుకుంటారు. ఆ గ్రామంలో గిరిజనులెవరూ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లు వినియోగించరు. గ్రీన్‌ అంబాసిడర్లు రోజూ చెత్తను సేకరించి.. వర్మీకంపోస్టు తయారు చేస్తుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడు మాట్లాడుతూ.. ‘ బియ్యాలవలస గ్రామంలోనే కాకుండా ఆ పంచాయతీ పరిధిలోని దురుబిలి, పెళ్లివలస, సూర్యానగరం, మర్రిగూడ, మంత్రజోల, సేకుపాడు, రంగుపురం, దిమిటిగూడ, గొందిలోవ, గొందిలోవ కాలనీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నాం. ప్రజల సహకారంతో పంచాయతీ పరిధిలోని పది గ్రామాలను ముస్తాబు గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.

గత నెలలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి బియ్యాలవలసను సంద ర్శించారు. గిరిజన గ్రామస్థులు స్వచ్ఛతకు పెద్దపీట వేయడం చేసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం వారిని కట్టిపడేసింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ బియ్యాల వలసను మన్యంలో తొలి ముస్తాబు గ్రామంగా ప్రకటించారు. జిల్లాలో అన్ని గ్రామాలనూ బియ్యాల వలసలా తీర్చిదిద్దేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - Feb 03 , 2026 | 11:40 PM