Excelled in JEE Advanced జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటారు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:25 AM
Excelled in JEE Advanced జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మన్యం విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి.. సత్తాచాటారు.
ఆశిష్‌కు జాతీయస్థాయిలో 20వ ర్యాంక్
బెలగాం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మన్యం విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి.. సత్తాచాటారు. పార్వతీపురం పట్టణం బెలగాం చర్చివీధికి చెందిన అలజంగి ఆశిష్‌బాబు ఆల్‌ఇండియా కేటగిరీలో 1375వ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో 20వ ర్యాంక్ సాధించాడు. ఆ విద్యార్థి తండ్రి గౌరీశ్వరరావు బలిజపేట మండలం నారాయణపురం పంచాయతీ సెక్రటరీగా, తల్లి అలజంగి విజయలక్ష్మి రేషన్ డీలర్‌గా పని చేస్తున్నారు. వారంతా కొంతకాలంగా బొబ్బిలిలో నివాసం ఉంటున్నారు. టెన్త్ విశాఖ, ఇంటర్ విజయవాడలోని ఓ ప్రైవేట్ విద్యాలయంలో ఆ విద్యార్థి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆశిష్‌బాబు విశాఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- సీతానగరం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): జోగింపేట ప్రతిభ జూనియర్ కళాశాలకు విద్యార్థులు ఎస్టీ విభాగంలో వి.గణేష్‌కుమార్ 942వ ర్యాంకు, జి.అభిరామ్ 1256వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా పి.స్టీఫెన్ 1596వ ర్యాంకు, బి.రమేష్ 1920వ ర్యాంకు, సాయికిరణ్ 2,384వ ర్యాంకు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ ధర్మరాజు, సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.
- గరుగుబిల్లి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): హిక్కింవలస గ్రామానికి చెందిన పెంట శ్రీశాంత్ ఆల్ ఇండియా కేటగిరీలో 651వ ర్యాంకు, ఓబీసీ ఎన్‌సీఎల్‌లో 108వ ర్యాంకు సాధించాడు. అడ్వాన్స్ పరీక్షకు సంబంధించి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో 224 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి తండ్రి పెంట శ్రీనివాసరావు ఉపాధ్యాయుడుగా, తల్లి వసంతలక్ష్మి గుమ్మలక్ష్మీపురం జూనియర్ కళాశాలలో బోటనీ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఇంజనీర్‌గా ఎదగాలన్నదే ప్రధాన లక్ష్యమన్నాడు. ముంబాయి, చెన్నై, ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఉందని , ఏఐ విభాగంపై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపాడు. ఐఐటీలో సీటు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గుడివాడలో టెన్త్, హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లు తెలిపాడు.
ఫలితాల్లో మెరిసిన గిరిజన విద్యార్థులు
సీతంపేట రూరల్,జూన్1(ఆంధ్రజ్యోతి): గిరిజన గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐఐటీ సూపర్60 బ్యాచ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు జేఈఈ అడ్వాన్స్‌లో సత్తాచాటారు. ఈ మేరకు సీతంపేట మండలం కుసిమి పంచాయతీ వజ్జాయిగూడ గ్రామానికి చెందిన సవర వెంకటరావు అనే గిరిజన విద్యార్థి ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 473వ ర్యాంక్ సాధించాడు. ఎస్.మణి(ప్రిపరేటరీ ర్యాంక్ 810), కె.శ్రీలత(865), ఎస్.భాగ్యలక్ష్మి (1309), ఎస్.దీన(1793), డి.స్వాతిభాయ్(2012) విద్యార్థులు ఎస్టీ కేటగిరీలో ప్రిపరేటరీ ర్యాంక్‌లు సాధించారు. కాగా వారిని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అభినందించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే..
‘జేఈఈ అడ్వాన్స్‌లో జాతీయస్థాయిలో ఎస్టీ కేటగిరీలో 473వ ర్యాంక్ ర్యాంక్ సాధించానంటే తల్లిదండ్రులు సవర మాసయ్య,గయారమ్మ, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణం. నిరుపేద గిరిజన(పీవీటీ.ఈ)కుటుంబంలో పుట్టిన నేను తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసి పట్టుదలతో చదివా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే నా లక్ష్యం. ’ అని సవర వెంకటరావు తెలిపాడు.