Everything is set for the second phase of elections. రెండోదశ ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:55 PM
Everything is set for the second phase of elections.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ అయిన పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 10 మండలాల్లో 308 పంచాయతీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండోదశ ఎన్నికలకు
సర్వం సిద్ధం
308 పంచాయతీల్లో పోలింగ్‌కు నోటిఫికేషన్
64 చోట్ల ఏకగ్రీవాలు
246 చోట్ల పోలింగ్‌కు ఏర్పాట్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.69 లక్షల మంది ఓటర్లు
విధుల్లో 6,156 మంది సిబ్బంది
పోలింగ్ కేంద్రాలు 2275
విజయనగరం, నవంబరు28 (ఆంధ్రజ్యోతి):
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ అయిన పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 10 మండలాల్లో 308 పంచాయతీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 64 పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. మిగిలిన 246 గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2,854 వార్డులకు గాను 858 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1996 వార్డులకు 4229 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందుకు 2275 పోలింగ్ కేంద్రాల్లో 6156 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికల్లో 3.69 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. వీరిలో 1,83, 275 మంది పురుషులు కాగా 1,85, 962 మంది మహిళలు, ఇతరులు 14 మంది ఉన్నారు. మొత్తం మీద పురుషుల కన్నా మహిళా ఓటర్లు 2,687 మంది అదనంగా ఉండటం విశేషం.
అత్యధిక ఓటర్లు ఇక్కడే.. అభ్యర్థులూ ఇక్కడే
రెండోవిడత పంచాయతీ పోరులో ఎక్కువ మంది ఒటర్లు ఉన్న మండలంగా రేగిడి మండలాన్ని గుర్తించారు. ఇక్కడ 48,837 మంది ఓటర్లు ఉండగా పోటీచేసే అభ్యర్థులు కూడా ఎక్కువుగా 597(వార్డు మంబర్లు) మంది ఉండటం విశేషం. వంగర మండలంలో అత్యల్పంగా 23, 518 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే..
1.గజపతినగరం
2.బొండపల్లి
3.దత్తిరాజేరు
4.గంట్యాడ
5.జామి
6.మెంటాడ
7.రాజాం
8.సంతకవిటి
9.వంగర
10.రేగిడి
పకడ్బందీగా పోలింగ్
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కంటోన్మెంట్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టరు ఎస్.రామసుందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వివిధ డిస్టిబ్యూషన్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగు సిబ్బంది రిపోర్టింగ్, వారికి కేటాయించిన పోలింగు కేంద్రాలకు తరలింపు ప్రక్రియను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల విధుల కోసం కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారుల వివరాలను సమీక్షించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1గంటవరకూ పోలింగు జరుగుతుందని, తరువాత 2 గంటల నుంచి సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. సాధ్యమైన చోట అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వీలుకాని పక్షంలో మరుసటి రోజు ఉదయం ఈప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు.
జనం గుంపులుగా చేరకుండా చూడాలి
ఎస్పీ దామోదర్
విజయనగరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా, అంకితభావంతో, సంయమనంతో విధులు నిర్వహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. పోలింగు కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు అనవసర వ్యక్తులు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు జరిగే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది విధిగా లాఠీ, విజిల్‌ను తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.