Everything is set for pollingపోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:02 AM
Everything is set for polling స్థానిక సంగ్రామంలో పట్టణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో అసలు ప్రక్రియ మొదలు కానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ కొనసాగనుంది.
పోలింగ్‌కు సర్వం సిద్ధం
విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మునిసిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో పూర్తయిన ఏర్పాట్లు
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ ఓటేయొచ్చు
పోలింగ్ కేంద్రాలకు తరలిన సామగ్రి, సిబ్బంది
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
స్థానిక సంగ్రామంలో పట్టణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో అసలు ప్రక్రియ మొదలు కానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ కొనసాగనుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. వెబ్ కాస్టింగ్ నిఘా కూడా ఉంటుంది. కాగా డిస్ర్టిబ్యూషన్ కౌంటర్లన్నీ ఎన్నికల అధికారులు, సిబ్బందితో శనివారం కోలాహలంగా కనిపించాయి. సిబ్బందికి ఎన్నికల మెటీరియల్ అయిన బ్యాలెట్‌బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఓటరు లిస్టులు, ప్లకార్డులు తదితర మెటీరియల్‌నంతటినీ ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది తమకు అప్పజెప్పిన మెటీరియల్‌ను సరిచూసుకున్నారు. ఆపై మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక బస్సులలో బయలుదేరారు.
విజయనగరం కార్పొరేషన్
ఓటర్ల సంఖ్య 2,23,050
డివిజన్ల సంఖ్య 62
పోలింగ్ కేంద్రాల సంఖ్య 229
బరిలో ఉన్న అభ్యర్థులు 169
విజయనగరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 229 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 860 బ్యాలెట్ బాక్సులను కేటాయించారు. కార్పొరేషన్‌లో 62 డివిజన్లు ఉండగా 2,23,050 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,15,015 మంది, పురుషులు 1,08,010 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో 16 మంది ఆర్వోలు, 16 మంది ఏఆర్వోలను నియమించారు. 14 రూట్లు, 14 జోన్లుగా విభజించి అధికారులను కేటాయించారు. పోలింగ్ సిబ్బంది కింద ప్రిసైడింగ్ అధికారులు 275 మంది, ఇతర సిబ్బందిని 1375 మందిని నియమించారు. అదే విదంగా ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం కావటంతో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొంటారని అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ప్రచారం ముగియడంతో అభ్యర్ధులు శనివారం ప్రలోభాలకు తెరలేపారు. ఎవరి దారిలో వారు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నం చేశారు. కొందరు డబ్బులు పంపిణీ చేయగా, ఇంకొందరు వస్తువుల రూపంలో ఓటును అభ్యర్థించారు.
---------------------------
నె ల్లిమర్ల నగర పంచాయతీ
ఓటర్ల సంఖ్య 19075
వార్డులు 23
పోలింగ్ కేంద్రాల సంఖ్య 24
బరిలో ఉన్న అభ్యర్థులు 59
నెల్లిమర్ల, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):
నెల్లిమర్ల నగరపంచాయతీలోనూ పోలింగ్‌కు అధికారులంతా సిద్ధమయ్యారు. నగర పంచాయతీలో 19075 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 23 వార్డులు ఉన్నాయి. పోలింగ్ నిర్వహణకు అధికారులు 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 173 మంది సిబ్బందిని నియమించారు. అందులో 29 మంది పీవోలు, 29 మంది ఏపీవోలు, 115 మంది ఓపీఓలు ఉన్నారు. శనివారం సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూమ్‌కు తరలిస్తారు. పోలింగ్ సందర్భంగా 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా నగర పంచాయతీలో పోటీ చేస్తున్న చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు 59మంది ఉండగా వారిలో మహిళలు 32 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ ముందురోజు శనివారం ప్రతి వార్డులోనూ ప్రలోభాలు నడిచాయి. గప్‌చుప్‌గా అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు అందించారు. అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో ఒకరోజు ముందే స్వస్థలాలకు రప్పించారు.
----------------------------
బొబ్బిలి మునిసిపాలిటీ
ఓటర్ల సంఖ్య 49,284
వార్డులు 36
పోలింగ్ కేంద్రాల సంఖ్య 69
బరిలో ఉన్న అభ్యర్థులు 95
బొబ్బిలి అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపాలిటీలోనూ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక్కడ చైర్‌పర్సన్ గిరీకి నలుగురు బరిలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 188 మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ గడువు పూర్తయ్యేనాటికి 93 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 95 మంది పోటీలో మిగిలారు. కొన్ని వార్డుల్లో రెబల్స్ ఉండడం గమనార్హం. బొబ్బిలి మున్సిపాలిటీ ఆవిర్భవించిన తర్వాత ఇంతవరకు ఇద్దరు మహిళలు చైర్‌పర్సన్ పదవిని అధిరోహించారు. వారిలో ఒకరు ఐవీఆర్ ఆండాళ్, రెండో వ్యక్తి తూముల అచ్యుతవల్లి. మున్సిపల్ ఎన్నికలకు స్థానిక ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఎన్నికల సిబ్బందికి మెటీరియల్‌ను పంపిణీ చేశారు. సుమారు 1100 మంది ఎన్నికల సిబ్బందికి మెటీరియల్‌ను అందజేశారు. ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, మున్సిపల్ కమిషనరు లాలం రామలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలక్షన్ ఆర్డర్లు అందుకున్న ప్రతీ ఒక్కరూ పోలింగ్ కేంద్రంలో శనివారం సాయంత్రం రిపోర్ట్ చేయాల్సిందేనని ఆర్డీవో మరోసారి స్పష్టంచేశారు.
------------------------
మేయర్, చైర్మన్ల బరిలో అభ్యర్థులు వీరే..
విజయనగరం కార్పొరేషన్‌లో
1.అవనాపు భార్గవి కూటమి అభ్యర్థి(టీడీపీ)
2.కోలగట్ల శ్రావణి వైసీపీ
3.బూర ఐశ్యర్యలక్ష్మీ కాంగ్రెస్
4.లింగాల పార్వతి బీఎస్‌పీ
5.చౌదరి స్పర్శ స్వతంత్ర
6.బెళ్లాన సంతోషికుమారి స్వతంత్ర
7.కోట సునీత ఆమ్‌ఆద్మీ
బొబ్బిలిలో..
1. రాంబార్కి రేణుకాదేవి కూటమి(టీడీపీ)
2.తూముల అచ్యుతవల్లి వైసీపీ
3.మువ్వల పద్మావతి కాంగ్రెస్
4.బొట్ల భవాని బీఎస్‌పీ
నెల్లిమర్లలో..
1.మైపాడ ప్రసాదరావు కూటమి(బీజేపీ)
2.సముద్రపు రామారావు వైసీపీ
3.కనకల పద్మనాభం కాంగ్రెస్
4.లెంక అప్పలనాయుడు స్వతంత్ర
------------------------------