Everything is ready for the jatara జాతరకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:57 PM
Everything is ready for the jatara
జాతరకు సర్వం సిద్ధం
పైడితల్లి అమ్మవారికి నవ కలశ స్నపనం
శాస్త్రోక్తంగా పూజలు చేసిన అర్చకులు
రేపు నేత్రోత్సవం
రాజాం రూరల్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఈనెల 22న ప్రారంభం కానుంది. వందో వార్షిక మహోత్సవాలు కావడంతో నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో బుధవారం నవకలశ స్నపన వేడుక నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేమకోటి సూర్యనారాయణ శర్మ సారధ్యంలో ఆదిత్యశర్మ పూజలు నిర్వహించారు. పంచామృతాలు, సముద్రం, నది, చెరువు, పుష్కర గంగలతో పాటు ఔషద, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఈవో బీవీ మాధవరావు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, ఎస్‌వీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు సలాది తులసీదాస్ తదితరులతో పాటు పెద్దఎత్తున భక్తులు అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ కలశ స్నపన కార్యక్రమం అనంతరం అమ్మవారి దర్శనాన్ని బుధవారం నుంచి నిలిపివేశారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈనెల 20న అమ్మవారికి నేత్రోత్సవం సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్తలు వాకచర్ల కుటుంబీకులు తొలి దర్శనం చేసుకుంటారు. ఆపై భక్తులకు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అప్పటివరకూ భక్తులంతా ఉత్సవ విగ్రహాలను మాత్రమే దర్శించుకుంటారు.
రాష్ట్ర పండుగగా పైడితల్లి జాతర
రూ.50 లక్షలు మంజూరు
రాజాం రూరల్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఈమేరకు జాతర నిర్వహణకు కామన్ గుడ్‌ఫండ్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజాంలోని అమ్మవారి జాతర మహోత్సవాల ప్రాధాన్యాన్ని... నిర్వహణ తీరున ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్.... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. వందేళ్ల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని నివేదించారు. ఈ మేరకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సంబంధిత కమిషనర్‌కు జాతర ప్రత్యేకతను వివరించారు. దీంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, మూడురోజుల పాటు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా, క్యూలైన్లు, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించాలని పేర్కొంటూ రూ.50 లక్షలు మంజూరు చేశారు.