Share News

Everything is ready అంతా సిద్ధం

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:23 AM

Everything is ready రాజాం మున్సిపల్‌ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన పూర్తయ్యింది. రిజర్వేషన్ల ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతోంది.

Everything is ready అంతా సిద్ధం

అంతా సిద్ధం

రాజాం మున్సిపాల్టీలో షెడ్యూల్‌ ప్రకటనే మిగిలింది

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మొత్తం 49 పోలింగ్‌ కేంద్రాలు

సార్వత్రిక ఎన్నికలు కంటే అదనంగా 8 కేంద్రాలు

కమిషనర్‌ ప్రతిపాదనలకు కలెక్టర్‌ ఆమోదం

రాజాం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

రాజాం మున్సిపల్‌ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన పూర్తయ్యింది. రిజర్వేషన్ల ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 32 వార్డులకుగాను 49 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ పరిధిలో 41 పోలింగ్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ పెరిగిన ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అదనంగా 8 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మున్సిపాల్టీలో పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, డోలపేటలో నాలుగు చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మారుతీనగర్‌, గోపాలపురం, మెంటిపేట, కొండంపేటలో రెండేసి... బుచ్చెంపేట, మాధవబజారు, లచ్చయ్యపేట, తిమ్మయ్యపేట, కొత్తవలసలో ఒక్కొక్కటి.. వస్త్రపురికాలనీ, పొనుగుటివలసలో 3, బొబ్బిలి రోడ్డు ఆర్సీఎం చర్చి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, సారథి రోడ్డులో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు ప్రతిపాదనలకు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం రాజాం మునిసిపాల్టీలో 36,786 మంది ఓటర్లు ఉన్నారు. సగటున ప్రతి 751 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు.

పూర్తయిన ఓట్ల మ్యాపింగ్‌..

మరోవైపు మున్సిపాల్టీలో ఓట్ల మ్యాపింగ్‌ కూడా పూర్తయింది. వార్డుల వారీగా ఈ ప్రక్రియ జరిగింది. దీనిని పక్కాగా చేపడుతున్నారు. ఎక్కడైనా అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా మల్లిఖార్జునకాలనీలో లోపాలు బయటపడ్డాయి. ఇక్కడ బీఎల్‌వో చేసిన తప్పిదం ఓటర్ల పోలింగ్‌ కేంద్రాన్ని మార్చేసింది. 18వ వార్డు పరిధిలోని ఓటర్లను 13, 14 వార్డులకు మ్యాపింగ్‌ చేసినట్టు తెలిసింది. దాదాపు 150 ఓట్ల వరకూ మ్యాపింగ్‌ చేసినట్టు సమాచారం. దీంతో మల్లిఖార్జునకాలనీ వాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మునిసిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. ఆయన వెనువెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బూత్‌ లెవల్‌ అధికారికి నోటీసు జారీచేశారు. తక్షణం సరిచేయాలని ఆదేశించారు. మొత్తం మునిసిపాల్టీలోనే మ్యాపింగ్‌ ప్రక్రియలో లోపాలు ఉంటే సరిచేయాలన్నారు. దాదాపు అన్ని ఏర్పాట్లతో రాజాం మునిసిపాల్టీ ఎన్నికలకు సిద్ధపడుతోంది. రెండో విడతలో భాగంగా ఈ నెల మూడో వారంలో షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

చురుగ్గా ఏర్పాట్లు

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 49 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. సార్వత్రిక ఎన్నికల కంటే అదనంగా మరో 8 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశాం. పెరిగిన ఓటర్లు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఓటు వేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నాం.

- రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం మునిసిపాల్టీ

Updated Date - Oct 28 , 2026 | 12:23 AM