Everything is online. అంతా ఆన్‌లైన్‌లోనే..
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:45 PM
Everything is online. ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. అధికారులు, సిబ్బంది కేటాయింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికింది. కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకాలన్నీ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
అంతా ఆన్‌లైన్‌లోనే..
టెన్త్ ఇన్విజిలేషన్‌లో కొత్త మార్పులకు శ్రీకారం
ఎలక్ర్టానిక్ పద్ధతిలో అధికారుల కేటాయింపు
ఎస్‌జీటీలకు పూర్తిగా మినహాయింపు
ఈ ఏడాది నుంచి ప్రైవేటు టీచర్లకూ అవకాశం
ప్రక్రియంతా రాష్ట్రస్థాయిలోనే..
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. అధికారులు, సిబ్బంది కేటాయింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికింది. కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకాలన్నీ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలు, అదనపు డీవోలుగా ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, సీనియర్ ఎస్‌ఏలను నియమించనున్నారు. పరీక్ష కేంద్రాల ఇన్విజలేటర్లుగా మొత్తం సిబ్బందిలో 20శాతం ప్రైవేటు టీచర్లకు అవకాశం కల్పించనున్నారు. ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాలలకు పదికిలోమీటర్ల పరిఽధిలోని పరీక్ష కేంద్రాల్లో వారు విధులు నిర్వహించేలా ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
ఫ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 23,523 మంది హాజరు కానున్నారు. వీరిలో 22,959 మంది రెగ్యూలర్, 564 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 29 స్టోర్‌జ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 119 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 119 మంది డిపార్టుమెంట్ అధికారులు, 1350 మంది ఇన్విజిలేటర్లను వినియోగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా 20 శాతం మందిని ఈ ఏడాది తీసుకుంటున్నారు.
నియామకాలనీ రాష్ట్రస్థాయిలోనే..
టెన్త్, ఇంటర్, ఓపెన్‌స్కూల్ పరీక్షల నిర్వహణకు నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బందికి విధులు అప్పగించనున్నారు. గతంలో ఎంఈవో కార్యాలయం నుంచి ఉపాధ్యాయుల వివరాలు తీసుకుని జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో నియామకాలు చేపట్టేవారు. దీంతో పరీక్షల నిర్వహణపై పలు విమర్శలు వచ్చేవి. ఈఏడాది నుంచి పారదర్శకంగా డ్యూటీ ఆర్డర్లు ఇవ్వాలనే ఆలోచనతోనే టీస్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిలో ఉపాధ్యాయులు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు. గతంలో ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా.. వీరి పిల్లలు ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా తదితర ఏడు అంశాలపై ఎంఈవోల ద్వారా ముందే సమాచారం సేకరించారు. వీటిలో ఏదైనా సమస్యలున్నవారిని, 60 సంవత్సరాలు దాటిన వారిని మినహాయించి మిగిలిన జాబితాలను ఎంఈవోల లాగిన్‌లకు పంపించారు.
ఫ ఇంటర్ పరీక్షల విధులకు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను నియమించవద్దని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులకు ఇంటర్ పరీక్షల ఇన్విజలేటర్లు నియమించుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పరిధిలో జరిగే టెన్త్, ఇంటర్ పరీక్ష పరీక్షలకు కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు.
తప్పించుకునే వీలుండదు
గతంలో మాదిరిగా ఏవేవో కారణాలు చెప్పి ఇన్విజిలేషన్ విధుల నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పకడ్బందీగా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇన్విజలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజకల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీతం ఇతర సబ్జెక్ట్‌లు బోధించేవారిని నియమించనున్నారు. అలాగే తెలుగు, హిందీ,ఇంగ్లీష్, సంస్కృతం పరీక్షలకు గణితం, సైన్స్, సోషల్ టీచర్లను విధుల్లో నియమిస్తారు. గ్రూప్ సబ్జెక్టులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచర్లను నియమిస్తారు.
---------------------