Offline.. అంతా ఆఫ్‌లైన్‌లోనే..
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:59 PM
Everything Goes Offline.. జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, లోడింగ్ పనులకు అనుమతులు పొందిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో రశీదులు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. వాస్తవంగా ఇసుక రీచ్ నుంచి ఎంత లోడ్‌తో ఏ వాహనం వెళ్తుంది, దానికి సంబంధించి ఎంత వసూలు చేస్తున్నారన్నది ఆన్‌లైన్‌లో పొందుపరిచి రశీదులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆఫ్‌లైన్‌లో మాత్రమే రశీదులు ఇస్తుండడం సర్వత్రా చర్చనీయాం శమవుతోంది.
ఆఫ్‌లైన్‌లో రశీదులు ఇస్తున్న వైనం..
ట్రాక్టర్ ఇసుకకు అదనంగా వసూలు
పట్టించుకోని గనులశాఖ
పార్వతీపురం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, లోడింగ్ పనులకు అనుమతులు పొందిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో రశీదులు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. వాస్తవంగా ఇసుక రీచ్ నుంచి ఎంత లోడ్‌తో ఏ వాహనం వెళ్తుంది, దానికి సంబంధించి ఎంత వసూలు చేస్తున్నారన్నది ఆన్‌లైన్‌లో పొందుపరిచి రశీదులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆఫ్‌లైన్‌లో మాత్రమే రశీదులు ఇస్తుండడం సర్వత్రా చర్చనీయాం శమవుతోంది. కొమరాడ మండలంలో చోళపదం వద్ద నాగావళిలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతి వాహనానికి ఆఫ్‌లైన్‌లో రశీదు ఇస్తోంది. ‘ఎంత ఇసుకను తీసుకెళ్తున్నారు.. ఎంత వసూలు చేస్తున్నారు’ అన్నది కూడా ఆ రశీదులో పొందుపర్చడం లేదు. ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేసి .. ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నా లెక్కల్లో చూపించడం లేదు. భామిని, పాలకొండ మండలాల్లోని ఇసుక రీచ్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికంగా వసూలు..
నిబంధనల ప్రకారం.. టన్ను ఇసుకకు లోడింగ్‌తో కలుపుకుని రూ.185 మాత్రమే వసూలు చేయాలని గనులశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ట్రాక్టర్‌కు రూ.1050 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. వాస్తవంగా ఒక ట్రాక్టర్‌కు రూ.830 వసూలు చేయాల్సి ఉంది. కానీ అదనంగా వసూలు చేస్తున్నా.. గనుల శాఖ చోద్యం చూస్తోంది. దీనిపై జిల్లా గనులశాఖాధికారి రామును వివరణ కోరగా.. ‘ ఆన్‌లైన్‌లో రశీదులు ఇవ్వాలి. ఆఫ్‌లైన్‌లో రశీదులు ఇస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. లోడింగ్‌తో కలుపుకుని టన్ను ఇసుకకు రూ.185 మాత్రమే తీసుకోవాలి. అదనంగా తీసుకోకూడదు. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల వద్ద లోడింగ్ కావడం లేదు. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక విక్రయిస్తున్నారు.’ అని తెలిపారు.