every work with bribe అక్కడంతా ‘మామూలే’...
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:21 AM
every work with bribe జిల్లాలో అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీరు ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నా, మీ పనిమీదే... మా పనిమాదే అన్నట్టుగా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు.
అక్కడంతా ‘మామూలే’...
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనికోరేటు వసూలు
అధికారుల రూటే సెపరేటు
ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దందా
అన్ని ధ్రువపత్రాలు ఉన్నా చేయి తడపాల్సిందే
లేకుంటే రోజుల తరబడి తిరగాల్సిందే
మెంటాడ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి):
- మెంటాడ గ్రామానికి చెందిన వృద్ధురాలు జి.రాములమ్మ కొద్ది రోజుల క్రితం తనకున్న ముప్పావు సెంటు గ్రామ కంఠం భూమిని వేరొకరికి విక్రయించి గజపతినగరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లింది. తహసీల్దార్ సర్టిఫికెట్ లేదని అదనంగా రూ.10 వేలు అడిగారు. ఇవ్వలేనని ప్రాధేయపడినా కనికరించలేదు. స్టాంపు డ్యూటీకీ ఇది అదనం. చేసేదిలేక ఇచ్చుకోక తప్పలేదని ఆమె వాపోతోంది. గజపతినగరం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటువంటివి మామూలే అని చెబుతున్నారు.
- మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మీసాల రాములమ్మ ఆండ్ర రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 19-2లో ఎకరా ఐదు సెంట్లు భూమిని మెంటాడకు చెందిన ఓ వ్యక్తికి గజపతినగరం రిజిస్ట్రార్ కార్యాలయంలో 2005లో రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం జూన్ 2023లో ఆమె మరణించారు. సవరణ పేరుతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కొందరు వ్యక్తులు 2025 ఫిబ్రవరిలో 18 సెంట్లు భూమిని డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న రాములమ్మ మనవడు శ్రీనువాసరావు కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుక ఖర్చుకున్న సబ్ రిజిస్ట్రార్ ఆ రిజిస్ట్రేషన్ రద్దుకు ఆదేశించారు.
- మెంటాడ మండలం పెద మేడపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ రెడ్డి ఎర్రనాయుడు కొద్దిరోజులు క్రితం ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కొరకు డాక్యుమెంట్ రైటర్‌ను కలిశారు. వీఆర్‌వో స్థల ధ్రువీకరణ పత్రం చూపించారు. తహసీల్దార్ సర్టిఫికెట్ లేనందున రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదిలేక ఇంటిముఖం పట్టారు.
ఇక్కడే కాదు జిల్లాలో అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీరు ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నా, మీ పనిమీదే... మా పనిమాదే అన్నట్టుగా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో కక్షిదారులకు రిజిస్ట్రేషన్ ఖర్చు రెండుమూడింతలు అదనంగా వదిలిపోతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే యజమానులు హడలిపోయే పరిస్థితి దాపురించింది. రిజిస్ట్రార్లు చేతికి అవినీతి మకిలి అంటకుండా తెలివిగా ఆఫీసుల బయట తిష్ఠ వేసి అనధికార డాక్యుమెంట్ రైటర్లను తెరపైకి తెస్తూ వారి డైరెక్షన్లో నడిపిస్తున్నారు. ఏ రిజిస్ట్రేషన్‌కు ఎంత? ఎవరికి ఎంత? పత్రాలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అనేది లెక్కగట్టి మరీ రైటర్లే డిసైడ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వద్దే అన్నీ పూర్తయ్యాక డాక్యుమెంట్ ఫైలు అక్కడ్నుంచి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్తోంది. ఇటు డాక్యుమెంటేషన్ ఫీజుతోపాటు, ఫార్మాలిటీస్‌లో కొంత కమీషన్ కూడా రైటర్స్‌కు ముడుతుందనేది క్రయవిక్రయదారుల మాట. రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది నెలవారీ జీతభత్యాలను మించి ఆదాయం రావడంతో రిజిస్ట్రేషన్ పార్టీలను ఆకర్షించేందుకు రైటర్లు పోటీపడుతున్నారు. వీరిమధ్య పోటీ ఎంత ఎక్కువగా ఉంటే క్రయవిక్రయదారులను తీసుకొచ్చేతమకు అంత గిట్టుబాటు అవుతున్నదని దళారీలు సంబరపడడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఉంటే కొంత.. లేకుంటే చెప్పినంత
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్‌కు గతంలో వీఆర్వో లేదా గ్రామ కార్యదర్శి సర్టిఫికెట్ సరిపోయేది. అయితే దీనివల్ల అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తహసీల్దార్ లేదా ఆ స్థాయి అధికారి సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. రిజిస్ట్రార్లు దీన్ని కూడా మస్తుగా సొమ్ము చేసుకుంటున్నారు. తహసీల్దార్ సర్టిఫికెట్ జారీకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని భూముల యజమానులు డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తే, ఎప్పట్లాగే వీఆర్వో, కార్యదర్శి సర్టిఫికెట్‌తో పని అయ్యేలా చూస్తామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువను బట్టి పదినుంచి ఇరవై వేల రూపాయలు రేటు ఫిక్స్ చేసి రిజిస్ట్రార్లకు విషయం వివరిస్తే నిబంధనలను పక్కన పెడుతున్నారు.
- పెళ్లి రిజిస్ట్రేషన్, ఆస్తుల మార్ట్‌గేజ్ అవనరమై వెళ్తే అప్పుడు కూడా ’రేటు’లెక్కగట్టిమరీ పిండేస్తున్నారు. రిజిస్ట్రేషన్, మార్ట్‌గేజ్ ఒకేరోజు జరిగితే మార్ట్ గేజ్ కు కొంత రిబేటు ఇస్తూ ఏదో మహోపకారం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళీకరణతో ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఎన్నెన్ని సంస్కరణలు అమలుచేస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగా నిరర్థకమై క్రయవిక్రయదారులకు కష్టాలను మిగుల్చుతున్నాయి. ఏసీబీ దాడులు జరిగాక కొన్నాళ్లు ఈ వ్యవహారాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి.
ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం
కార్యాలయంలో సిబ్బంది ఎవరైనా అదనంగా డిమాండ్ చేస్తే తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాను.
- తవిటయ్య, సబ్ రిజిస్ట్రార్, గజపతినగరం
--------------