Share News

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:47 PM

జిల్లాలో ప్రతి ఇంటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వసతిగృహాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతి ఇంటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వసతిగృహాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌బీఎం పథకం కింద కొత్త మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నామని, పాడైన వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని అన్నారు. పతి మరుగుదొడ్డికి రన్నింగ్‌ వాటర్‌, నీటిట్యాంక్‌, బోరు సౌకర్యం ఉండాలని, పనులు పూర్తయిన వెంటనే ఫొటోలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ వైశాలి, సీతంపేట ఐటీడీఏ పీవో స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

పంట బీమా తప్పనిసరి

ఈ ఖరీ్‌ఫ్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, అరటి రైతులు పంట బీమాను తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వరికి ఆగస్టు 15, మొక్కజొన్నకు జూలై 31, పత్తి, అరటికి జూలై 15 వరకు గడువు ఉందన్నారు. రుణ రైతులు బ్యాంకుల్లో, ఇతర రైతులు సీఎస్‌సీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌, ముఫ్త్‌ బిజీలీ యోజన కింద వెనుకబడిన తరగతులు (బీసీ) గృహ విద్యుత్‌ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక ప్రోత్సాహం కల్పించిందని కలెక్టర్‌ తెలిపారు. జీవో నెంబర్‌ 58 ప్రకారం అరులైన బీసీ కుటుంబాలకు రూ.20 వేల అదనపు సబ్సిడీ అందజేయనున్నట్టు చెప్పారు. నెలకు 200 యూనిట్లు లోపు విద్యుత్‌ వినియోగం ఉన్న బీసీ కుటుంబాలు రెండు కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం అందించే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేలు ఇవ్వనుందన్నారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కోసం స్థానిక విద్యుత్‌శాఖ, లేదా నెడక్యాప్‌ అధికారులను సంప్రదించాలని అన్నారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.ప్రతి పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మొత్తం 45 కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలిపారు. పాలకొండకు 20 కొత్త కేంద్రాలు, కురపాంకు మూడు, పార్వతీపురంలో 9, సాలూరులో 13 కొత్త కేం ద్రాలకు ప్రతిపాదన చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలశాఖ అధికారులు పాల్గొన్నారు.

- జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఎనన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ 80.82 శాతం పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 14లోగా మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 10 , 2026 | 11:47 PM