Even while saying there’s no problem...! ఇబ్బందేం లేదంటూనే..!
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:36 PM
Even while saying there’s no problem...! కీలక నేత పార్టీని వీడడాన్ని వైసీపీ నాయకులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పరోక్షంగా ఆయన పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే పరిస్థితిని పునఃసమీక్షించుకోకుండా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇబ్బందేం లేదంటూనే లోలోపల కలవరపడుతూ అర్థంలేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
ఇబ్బందేం లేదంటూనే..!
చిన్నశ్రీను కోసం తెగ ఆరాటపడుతున్న వైసీపీ
పరోక్షంగా ఆయన పేరు తలుచుకోకుండా జరగని సమావేశాలు
ఒకవైపు వ్యతిరేక ప్రచారం.. మరోవైపు కలవరం
టీడీపీలో చక్కగా ఇమిడిపోయిన మజ్జి శ్రీనివాసరావు
జీర్ణించుకోలేకపోతున్న విపక్ష నాయకులు
కీలక నేత పార్టీని వీడడాన్ని వైసీపీ నాయకులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పరోక్షంగా ఆయన పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే పరిస్థితిని పునఃసమీక్షించుకోకుండా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇబ్బందేం లేదంటూనే లోలోపల కలవరపడుతూ అర్థంలేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తద్వారా మరింత పలుచన అవుతామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చక్కగా ఇమిడిపోయిన మజ్జి శ్రీనివాసరావు ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
విజయనగరం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో నెంబరు 2గా పేరు సంపాదించుకున్న జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి గుడ్‌బై చెప్పి కొద్దిరోజులవుతోంది. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని సైతం వదులుకున్నారు. అయితే ఆ పార్టీ నేతలు ఆయన వైసీపీలో ఉన్నప్పడు బలవంతుడుగా.. టీడీపీలో చేరిన తరువాత బలహీనుడుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆపై అనుకూల మీడియాలో అసలు చిన్నశ్రీను నాయకుడే కాదు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా చిన్నశ్రీను ముందుకు సాగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ నేతగా ఒదిగిపోయారు. దశాబ్దాల వైరాన్ని మరిచి ఎంచక్కా టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. నేరుగా గోవా వెళ్లి గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును కలిశారు. జిల్లా వ్యాప్తంగా అందరి ప్రజాప్రతినిధులను కలుసుకునివారి మన్ననలు పొందారు. అందరితో కలిసి పనిచేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మరింతగా బెంబేలెత్తుతున్నాయి. ప్రజా హిత కార్యాచరణ మానేసి చిన్న శ్రీనుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి.
అబ్బెబ్బే అతను ఏమంత పెద్ద నాయకుడు కాదని ఒకసారి.. ఆయన వెళ్లిపోవడంతో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదని మరోసారి.. ఒకరు పోతే ఇద్దరు వచ్చారు అంటూ ప్రతి సభలో చిన్నశ్రీను గురించి పరోక్షంగా చెప్పుకోవాల్సిన పరిస్థితికి దిగింది. నాయకులు వస్తుంటారు, వెలుతుంటారని... తాము మాత్రం జగన్ అన్నను వదిలి వెళ్లబోమని చెప్పుకొస్తున్నారు. అయితే చిన్నశ్రీనుతో వైసీపీకి వచ్చిన నష్టం లేదంటూనే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పరోక్షంగా ఆయన పేరు తలుచుకోవడం మాత్రం మానడం లేదు. ఇప్పటికే చిన్నశ్రీను పార్టీ మారిన తరువాత బొత్స సత్యనారాయణ రెండు, మూడుసార్లు కన్నీరు పెట్టుకున్నారు.. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. తమకు వచ్చిన నష్టం లేదంటూ, చిన్నశ్రీను ప్రభావం తలుచుకొని ఆందోళనకు గురవుతున్నారని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కూడా స్థానిక ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్చుతుందని, ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దూకుడు కనబరుస్తున్నారన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
అందరితో కలివిడిగా..
సాధారణంగా ఒక పెద్దస్థాయి నాయకుడు ఒక పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీలో చేరితే అనేక రకాల ఇబ్బందులు తప్పవు. అంత సులువుగా ఇమడలేరు. కానీ చిన్నశ్రీను మాత్రం ఎటువంటి బేషజాలాలకు పోలేదు. పైగా టీడీపీ సీనియర్లు సైతం ఆయనను ఆత్మీయంగా కలుపుకున్నారు. చీపురుపల్లిలో రాజకీయ పోరాటం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును కలవడమే కాదు సీనియర్‌గా అనుభవం ఉన్న కళా వెంకటరావు సలహాలతో ముందుకు సాగుతానని చెప్పారు. మిగతా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ జిల్లా నేతలతో మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారు. దీనిని వైసీపీ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
------------------