'worry' has been resolved! దిగుబడి తగ్గినా.. ‘చింత’ తీరింది!
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:18 AM
Even though the yield has decreased... the 'worry' has been resolved! సీతంపేట ఏజెన్సీలో ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఒక్కో కేజీకి రూ.40వరకు అదనంగా ధర పలకడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాసులు కురిపిస్తున్న పంట
ఆనందంలో గిరిజన రైతులు
జీసీసీ లక్ష్యం నెరవేరేనా?
సీతంపేట రూరల్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఒక్కో కేజీకి రూ.40వరకు అదనంగా ధర పలకడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో చింతపండు ఒక్కో కేటు(20కేజీల)ధర రూ.1600వరకు పలుకుతోంది. అదే బ్లాక్‌మార్కెట్‌లో అయితే కేజీ చింతపండు ధర ఏకంగా రూ.100వరకు పలుకుతోంది. గత ఏడాది కంటే ఈఏడాది చింతపండుకు ధర పెరిగినప్పటికీ పంట తగ్గిపోవడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, కొత్తూరు, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం వంటి మండలాల్లో చింతపండు ఎక్కువగా పండుతోంది. ఈ ప్రాంతంలో గిరిజనులు సేకరించే చింతపండు నాణ్యతగా ఉండడంతో మైదాన ప్రాంతాల్లో ఈ పంటకు ఎక్కువ గిరాకీ ఉంది. అయితే ఏటా గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఈఏడాది మాత్రం పరిస్థితి మారింది. గిరిజన రైతులు ఊహించని ధర పలుకుతోంది. దీంతో వారు చింతపండు సేకరించే పనిలో పడ్డారు.
దిగుబడి తగ్గుముఖం
సీతంపేట మన్యంలో ఏటా 80 టన్నుల వరకు చింతపండు దిగుమతి అయ్యేది. అయితే ఈఏడాది దిగుబడి తగ్గింది. సుమారు 60టన్నుల వరకే పంట వచ్చే అవకాశం ఉందని గిరిజన రైతులు భావిస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో పొల్ల, టిటుకుపాయి, మానాపురం, చింతాడ, పూతికవలస, మర్రిపాడు, చిన్నబగ్గ, జైపురం, దోనుబాయి, శంభాం, కడగండి, ఓండ్రుజోల, రేగుమానుగూడ, అంటికొండ, పెద్దగూడ, తుంబలి, కిండంగి, అక్కన్నగూడ, రాజన్నగూడ, మొగదారగూడ, రుక్మిణిగూడ గ్రామాల నుంచి సమీపంలో ఉన్న వారపుసంతలకు చింతపండు దిగుమతి అవుతోంది. అయితే ఏటా దిగుమతికి తగ్గట్టుగా మద్దతు ధర రాకపోవడంతో గిరిజన రైతులు ఈ పంటపై ఆసక్తి చూపడం లేదు. దీంతో కాలక్రమేణా దిగుబడి తగ్గుముఖం పడుతూ వస్తోంది. మరోవైపు ఏటా తుఫాన్ల ప్రభావానికి ముదిరిపోయిన చింతచెట్లు నేలకొరుగుతున్నాయి. వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటకపోవడంతో పంట తగ్గుముఖం పడుతోంది. అంతేకాకుండా గిరిజన రైతులు పోడు వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగా కొండపై ఉన్న చింతచెట్లను తొలగిస్తుండడంతో ఏజెన్సీలో పంట దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది.
ధర పెంచినా..
ఈఏడాది సీతంపేట, పాతపట్నం బ్రాంచ్‌ల పరిధిలో 1200టన్నుల చింతపండు కొనుగోలు చేయాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్ది రోజుల కిందట గిరిజన సహకార సంస్థ చింతపండు ధర పెంచింది. గత ఏడాది కిలో ధర రూ.36 ఉండగా ఈఏడాది రూ.9 పెంచి కేజీ రూ.45గా ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో గిరిజన ఉత్పత్తులకు ఉన్న ధరలతో పోల్చుకుంటే జీసీసీ ప్రకటించిన ధరలు తక్కువగానే ఉంటున్నాయి. దీంతో అటవీ ఉత్పత్తులను జీసీసీకి విక్రయించేందుకు గిరిజనులు ముందుకు రావడం లేదు. ఈఏడాది సీతంపేట ఏజెన్సీలోని వారపుసంతల్లో చింతపండు నాణ్యతను బట్టీ కేజీ ధర రూ.80 నుంచిరూ.90 వరకు పలుకుతోంది. ఈ ధరకే గిరిజనుల నుంచి మైదాన ప్రాంతవాసులు చింతపండును కొనుగోలు చేసుకుని మార్కెట్‌లో కేజీ రూ.100వరకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వారపుసంతల్లో జీసీసీ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
గిరాకీ ఉంది
సీతంపేట ఏజెన్సీలో చింతపండుకు ఈఏడాది మంచి గిరాకీ ఉంది. మార్కెట్‌లో కేజీ ధర రూ.80 వరకూ ఉంది. దిగుబడి తక్కువగా ఉన్నా.. సేకరించిన చింతపండుకు ఆశించిన ధర లభిస్తోంది.
- సవర రుగ్గయ్య, రుక్మిణిగూడ
===============================
మార్కెట్ రేట్‌కే కొనుగోలు చేయాలి
వారపు సంతల్లో కేజీ చింతపండు ధర రూ.80వరకు ఉంటే జీసీసీ మాత్రం రూ.45కు కొనుగోలు చేస్తామంటోంది. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరకు అనుగుణంగానే జీసీసీ కూడా గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేయాలి.
- లక్ష్మణరావు, అధ్యక్షుడు, జిల్లా గిరిజన సంఘం
=====================================
జీసీసీ డీఎం ఏమన్నారంటే..
‘ ఈ ఏడాది ఏజెన్సీలో చింతపండు దిగుబడి తక్కువగా ఉంది. అందుకే ధర అధికంగా ఉంది. కేజీ రూ.45 చొప్పున చింతపండు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం. బహిరంగ మార్కెట్‌లో చింతపండు ధర ఎక్కువగా ఉండడంతో తమకు విక్రయించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు.’ అని జీసీసీ డీఎం బి.కృష్ణారావు తెలిపారు.