Share News

ఉన్న ఒక్కటి కూడా!

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:57 AM

జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. ఇప్పటికే సహకార రంగంలో పనిచేస్తూ వస్తున్న భీమసింగి, లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ కర్మాగారాలు మూతపడ్డాయి.

ఉన్న ఒక్కటి కూడా!
సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీ

  • మూత దిశగా సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ?

  • వైసీపీ హయాంలో భీమసింగి, ఎన్‌సీఎస్‌ మూత

  • తెరిపించే ప్రయత్నం చేయని అప్పటి పాలకులు

  • జిల్లాలో గణనీయంగా తగ్గిన చెరుకు సాగు

  • ఉత్పత్తికి తగ్గట్టు అందక మూతదిశగా సంకిలి ఫ్యాక్టరీ?

విజయనగరం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. ఇప్పటికే సహకార రంగంలో పనిచేస్తూ వస్తున్న భీమసింగి, లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ కర్మాగారాలు మూతపడ్డాయి. ఇప్పుడు రేగిడి మండలంలోని సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ సైతం గానుగ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జిల్లాలో సుగర్‌ ఫ్యాక్టరీల చరిత్ర ముగిసినట్టే. విజయనగరం పేరు చెబితే భీమసింగి చక్కెర కర్మాగారం పేరు వినిపించేది. సహకార రంగంలో పనిచేస్తూ వచ్చిన ఈ ఫ్యాక్టరీని ఆఽధునికీకరణ పేరుతో వైసీపీ హయాంలో నిలిపివేశారు. ఐదేళ్ల కాలయాపన చేసి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా పురోగతి లేదు. మరోవైపు లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ కార్మగారం పరిస్థితి అలానే ఉంది. మూతపడి ఏళ్లు దాటుతున్నా తెరుచుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు సంకిలిలో ఫ్యారీస్‌ చక్కెర కర్మాగారం కూడా గానుగ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి 1997లో ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జునరావు (జీ.ఎం.ఆర్‌) 200 ఎకరాలు సేకరించి ఈ పరిశ్రమను స్థాపించారు. ఆన తి కాలంలోనే దీనికి అనుబంధంగా పవర్‌ ప్లాంట్‌, డిస్టలరీ (ఇథనాల్‌) ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. 12 ఏళ్లపాటు నడిపిన ఆయన చెన్నైకి చెందిన ఈఐడీ ప్యారీ సంస్థకు విక్ర యించారు. నాటి నుంచి నేటి వరకు 30 ఏళ్లు విరామం లేకుండా ముందుకు నడిచింది. అంతటి చరిత్ర ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు.. ఒక ఏడాది విరామం ప్రకటించటంతో సర్వత్రా ఉత్కంఠగా ఉంది. దీంతో వేలాది మంది కార్మికులు వీధినపడనున్నారు. కానీ అంతకు మించి వేలాది మంది రైతులకు సైతం నష్టం తప్పడం లేదనే భావన వినిపిస్తోంది. ఫ్యాక్టరీల మూతకు ప్రధాన కారణం చెరకు సాగు తగ్గుముఖం పట్టడమే. గతంలో చెరుకు సాగుతో జిల్లా కళకళలాడేది. చక్కెర కర్మాగారాలు ప్రోత్సాహాలు అందించేవి. రానురాను ఎన్‌సీఎస్‌, భీమసింగి కర్మాగారాలు మూతపడ్డాయి. ఒక్క సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారమే మిగిలింది. అది కూడా ఇప్పుడు మూతపడుతుందని తెలుస్తుండడం బాధాకరమని రైతులు అంటున్నారు. చెరుకు సాగుకు ప్రోత్సాహం లేదు. పంటకు గిట్టుబాటు ధర లేదు. అందుకే రైతులు చెరుకు సాగును నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టారు.

సగానికి పైగా తగ్గుదల..

ఏడాదికేడాది చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 60శాతం పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌సీఎస్‌, భీమసింగి, సంకిలి ఫ్యాక్టరీల జోన్‌ పరిధిలో గత ఏడాది ఇదే సమయానికి 1,659 హెక్టార్లలో సాగుచేయగా.. ఈ ఏడాది కేవలం 491.14 హెక్టార్లలో మాత్రమే సాగయింది. భీమసింగి పరిధిలో అయితే రైతులు చెరుకు సాగు మానేశారు. ఎన్‌సీఎస్‌ పరిధిలో 403 హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది 43.47 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. సంకిలి ఫ్యాక్టరీ పరిధిలో గత ఏడాది 1205 హెక్టార్లలో చెరుకు వేయగా ఈ ఏడాది 447 హెక్టార్లల్లో మాత్రమే సాగుచేసినట్టు అధికారులు చెబుతున్నారు.

గానుగకు తగినట్టు అందని చెరకు..

సంకిలి ఫ్యాక్టరీ నిలిచిపోవడానికి ప్రధాన కారణం గానుగకు ఆశించిన స్థాయిలో చెరకు అందకపోవడమే. 7 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరుకు గానుగ ఆడితేనే ఫ్యాక్టరీ మనుగడ ఉంటుంది. కానీ ప్రస్తుతం 2.50 లక్షల టన్నుల చెరుకు మాత్రమే గానుగకు అందుబాటులో ఉంది. గతంలో 15 మండలాల పరిధిలో తోటపల్లి, మడ్డువలస, తాటిపూడితో పాటు సాగునీటి వనరులున్న ప్రాంతాల్లో చెరకు పండించేవారు. పండిన పంటను సుగర్‌ ఫ్యాక్టరీలకు తరలించేవారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేవారు. కానీ ఒక్కో రాయితీ దూరమైంది. గతంలో రవాణా చార్జీలు ఇచ్చేవారు. విత్తనాలు, ఎరువులు అందించేవారు. సాగు ప్రోత్సాహం కింద ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ అందించేవారు. రానురాను అవన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు సాగుకు దూరమయ్యారు. ఇప్పటికైనా చెరకు సాగుకు ప్రోత్సాహంతో పాటు చక్కెర కర్మాగారాలు తెరిపించాల్సిన అవసరం ఉంది.

మంత్రి అచ్చెన్నను కలిసిన చెరుకు రైతులు

  • సంకిలి ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయంపై చర్చ

  • పరిశ్రమను పరిరక్షించాలని వినతి

రేగిడి, ఆగస్టు 31:(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలోని ఏకైక చక్కెర పరిశ్రమ సంకిలి సుగర్స్‌ మూసివేస్తున్న నేపథ్యంలో ఏపీ రైతుసంఘం, చెరుకు రైతులు పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. రాజాం, చీపురపల్లి ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమొహనరావు, కిమిడి కళావెంకట్రావును కలిసిన వీరు ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. గత మూడేళ్లుగా ఫ్యాక్టరీ మనుగడ, వచ్చే ఎడాది క్రషింగ్‌ సీజన్‌ మూసివేస్తే చెరకు రైతులు నష్టపోతారని అయన దృష్ఠికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. సుగర్స్‌ జీఎంకు ఫోన్‌చేసినట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. ఫ్యాక్టరీ

మూసివేత నిర్ణయం సరికాదని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏనిర్ణయం తీసుకోవద్దని, చెరుకు రైతులను గందరగోళం చేసే ప్రకటనలు వద్దని మంత్రి జీఎంకు చెప్పినట్లు వెల్లడించారు. రైతులు చెరుకు సాగుచేసి పరిశ్రమ యాజమాన్యానికి సహకరించాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఫ్యాక్టరీని నిలబెట్టుకుందామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఏపీ రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సభ్యులు కింజరాపు సురేష్‌, చింత సంగంనాయుడు, సూర్యప్రకాశ్‌భుక్తా, పంచరెడ్డి సింహాచలం, గంగు క్రిష్ణారావు, కర్రి రమణ తదితరులు తెలిపారు. ఇందుకు పరిరక్షణ కమిటీ సైతం తమ కార్యాచరణను మంత్రికి తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలో చెరుకు సాగు అవసరం గురించి విస్తృత ప్రచారం చేస్తామని, ఇందుకు కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు. యాజమాన్యం సైతం తొలగించిన కేన్‌ సిబ్బందిని తక్షణమే నియమించి, గతంలో చెరకు రైతుకు ఇచ్చిన రాయితీలు కొనసాగిస్తే 4లక్షల మెట్రిక్‌ టన్నులకు చెరుకు గానుగకు డోకా ఉండదని వివరించారు.

Updated Date - Sep 01 , 2026 | 12:57 AM