Share News

Even Survival Is a Struggle! చచ్చినా కష్టమే!

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:31 AM

Even Survival Is a Struggle! ఆ ఊరి ప్రజలకు చనిపోయినా కష్టాలే! ఊరి బయట.. జబ్బుతో లేదా ప్రమాదంలో మృతి చెందితే ఇక నరకమే! అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించాలంటే వారి ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.

Even Survival Is a Struggle! చచ్చినా కష్టమే!
మృత‌దేహాన్ని మోసుకుంటూ స్వ‌గ్రామానికి తీసుకెళ్తున్న దృశ్యం

  • అత్యవసర పరిస్థితి వస్తే డోలీ కట్టి నడవాల్సిందే

  • రెండు కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉండడంతో..

  • వనకాబడి గ్రామస్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు

  • రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడి మృతి

  • కర్రకు కట్టుకుని ఊరికి తీసుకెళ్లిన బంధువులు

  • రహదారి బాగుచేయాలని ఏళ్లుగా వినతులు

ఆ ఊరి ప్రజలకు చనిపోయినా కష్టాలే! ఊరి బయట.. జబ్బుతో లేదా ప్రమాదంలో మృతి చెందితే ఇక నరకమే! అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించాలంటే వారి ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. మృతదేహాన్ని కర్రకు కట్టుకుని భుజాన మోసుకుంటూ రెండు కిలోమీటర్లు నడవాలి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడి గిరిజన గ్రామస్థుల దుస్థితి ఇది.

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వనకాబడి నుంచి దేరువాడ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. రెండు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు మీద నడవాలన్నా కష్టమే. వాహనాలు రావడం మాట దేవుడెరుగు. దీంతో ఎవరైనా జబ్బు బారిన పడితే డోలీ కట్టాల్సిందే. రాత్రి పూట అయితే ఎంత నొప్పి ఉన్నా భరించాల్సిందే. పొద్దు పొడిచాక డోలీ కట్టి రాళ్లు రప్పలు దాటుకుని మైదాన ప్రాంతం దేరువాడకు రావాలి. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యసేవలు పూర్తయి కోలుకున్న తర్వాత కూడా ఊరికి వెళ్లాంటే డోలీనే గతి. ఇక ఆసుపత్రుల్లో ఎవరైనా చనిపోతే.. ఏదేని ప్రమాదంలో మృతి చెందితే.. ఆ గ్రామస్థులు నరకం చవి చూడాల్సిందే. మృతదేహాన్ని దేరువాడ వరకు తెచ్చి.. అక్కడ కిందకు దించి ఒక పొడువాటి కట్టెకు మృతదేహాన్ని కట్టాలి. దాన్ని ఇద్దరు వ్యక్తులు భుజాన మోసుకుంటూ ఊరికి తీసుకెళ్లాలి. ఒకటి, రెండు కాదు.. దశాబ్దాలుగా ఈ గిరిజన గ్రామస్థులు అనుభవిస్తున్న దుర్భర జీవితం ఇది. వనకాబడిలో సుమారు 60 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 200 వరకు జనాభా ఉన్నారు. రోడ్డు సదుపాయం లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా దేరువాడ-వనకాబడి రోడ్డు నిర్మాణానికి గతేడాది డిసెంబరులో రూ. 2కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం కల్వర్టు పనులు అవుతున్నాయి. ఆ తర్వాత రహదారి పనులు పూర్తి చేస్తామని పీఆర్‌ ఏఈ మురళి చెబుతున్నారు. ఈ రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడ తమ కష్టాలు తీరుతాయి? అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

దుఃఖాన్ని దిగమింగుకుని.. కర్రకు కట్టుకుని..

ఆ గిరిజన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. వృద్ధాప్యంలో తమకు తోడునీడగా ఉంటాడని భావించారు. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న తమ కుమారుడికి పెళ్లి చేసి.. ఓ ఇంటివాడిని చేయాలనుకున్నారు. కానీ రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు చనిపోయారు. కన్నబిడ్డ ఆకస్మిక మరణాన్ని ఆ కన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల బంగారురాజు (28) టెన్త్‌ వరకూ చదువుకున్నాడు. తన తల్లిదండ్రులకు పోడు వ్యవసాయమే ఆధారం. దీంతో విశాఖలో కొన్నాళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా సెలవుపై కొద్దిరోజుల కిందట స్వగ్రా మానికి వచ్చిన బంగారురాజు ఈనెల 19న గురువారం సాయంత్రం తిరిగి విశాఖకు బైక్‌పై బయల్దేరాడు. అయితే మార్గమధ్యలో విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని బూర్జివలస వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రాజును స్థానికుల సాయంతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం రాజు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం, శవపంచనామా పూర్తయిన తర్వాత మృతదేహాన్ని దేరువాడ వరకు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అక్కడ నుంచి వనకాబడికి రహదారి లేని కారణంగా మృత దేహాన్ని కర్రకు కట్టి.. రెండు కిలోమీటర్ల మోసుకుంటూ గ్రామానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం దహన సంస్కారాలు చేశారు. ప్రమాద ఘటనపై బూర్జివలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:31 AM