పంచాయతీ పోరులోనూ
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:32 AM
పంచాయతీ పోరులో కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మెజార్టీ పంచాయతీలను గెలుచుకుంది.
కూటమిదే హవా
- తొలి విడతలో స్పష్టమైన ఆధిక్యత
- రెండు నియోజకవర్గాలో ఏకపక్ష ఫలితం
- వైసీపీకి స్వల్ప ఓట్ల తేడాతో దక్కిన పంచాయతీలు
విజయనగరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ పోరులో కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మెజార్టీ పంచాయతీలను గెలుచుకుంది. ఇప్పటికే మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన కూటమి పంచాయతీ ఎన్నికల్లోనూ గట్టి ప్రభావమే చూపింది. పార్టీలకు రహితంగా ఎన్నికలు జరగడంతో రాజకీయ గుర్తులు ఉండవు. ఈ నేపథ్యంలో కూటమి మధ్య సమన్వయం లేనిచోట, అధికార పార్టీ నేతల ఆధిపత్యం ఉన్నచోట మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ప్రత్యర్థులు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో 8 మండలాల పరిధిలో..221 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి ఏకపక్షంగా గెలుపొందింది. అదే సమయంలో కూటమిలో ఇద్దరు, ముగ్గురు బరిలో ఉన్నచోట భారీ చీలిక వచ్చి వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో గెలిచారు. కేవలం సమన్వయలోపం వల్లే చాలాచోట్ల వైసీకి అవకాశం దక్కింది.
బొబ్బిలిలో 70 శాతానికిపైగా..
బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కూటమి 72 (70శాతానికి పైగా) పంచాయతీలను సొంతం చేసుకొని నాలుగు మండలాల్లో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. వైసీపీ సైతం 34, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. అయితే టీడీపీ కూటమి అభ్యర్థులకు వందలాది ఓట్ల మెజార్టీ రాగా.. వైసీపీ అభ్యర్థులు 20, 30 ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బేబి నయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే బొబ్బిలి మునిసిపాల్టీని కైవసం చేసుకున్నారు. పరిషత్ ఎన్నికల్లో నాలుగు మండలాలను సునాయాసంగా గెలుచుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకత్వం పూర్తిగా బలహీనం అయింది. కానీ అధికార కూటమిలో స్థానిక నేతలు ఎక్కడికక్కడే పట్టుకు దిగడం ఇబ్బందికరంగా మారింది. అయినా స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన సమన్వం చేసుకున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సైతం అధికార టీడీపీ కూటమి మరోసారి పైచేయి సాధించింది. బొబ్బిలి మండలంలో 20, బాడంగి మండలంలో 18, తెర్లాంలో 21, రామభద్రపురం మండలంలో 12 పంచాయతీల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. చాలాచోట్ల రెబల్స్ పోటీచేయడంతో ప్రత్యర్థికి కలిసివచ్చింది.
ఎస్.కోటలోనూ అంతే..
శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు. 4 మండలాల పరిధిలో 111 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ కూటమి అభ్యర్థులు 73 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 37 చోట్ల సత్తా చాటింది. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ఎస్.కోట మేజర్ పంచాయతీతో పాటు కొత్తవలస మేజర్ పంచాయతీని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె స్వగ్రామం లక్కవరపుకోట మండలం ఖాసాపేట పంచాయతీ. ఈసారి అక్కడ కోళ్ల లలితకుమారి కుమార్తె హసితానాయుడు బరిలో నిలిచి విజయం సాధించడం విశేషం. పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. నాలుగు మండల పరిషత్‌లతో పాటు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య పోటీ నెలకొంది. ఒకే పంచాయతీలో ఇద్దరు నేతలు బరిలో నిలిచారు. అటువంటి చోట మాత్రం వైసీపీకి స్వల్ప ఓట్లతో పంచాయతీలు చిక్కాయి.
సమన్వయం లేనిచోట..
పంచాయతీ ఎన్నికలు పార్టీలకు రహితంగా జరిగాయి. వీటికి ఎన్నికల గుర్తులతో సంబంధాలు లేవు. పైగా చాలాచోట్ల స్వతంత్రులు గెలిచారు. వీరంతా దాదాపు అధికార పార్టీకి సంబంధించిన వారే. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు..తరువాత చాలామంది నేతలు టీడీపీ కూటమి పార్టీల్లో చేరారు. అందుకే చాలాచోట్ల నేతలు పంచాయతీలపై ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ మంది ఆశావహులు తయారయ్యారు. దీంతో పోటీ ఎక్కువగా కొనసాగింది. ఈ తరుణంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మండలస్థాయి నాయకులు పంచాయితీలు చేశారు. కానీ నేతలు దారికి రాలేదు. అటువంటిచోట్ల ఇద్దరు నాయకుల చొప్పున పోటీచేయగా.. అది వైసీపీకి కలిసివచ్చింది.