Share News

ఊరు మారినా.. బతుకు మారలే!

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:35 PM

ఊరు మారితే తమ బతుకులు మారుతాయని ఆ గిరిజనులు అనుకున్నారు.

 ఊరు మారినా.. బతుకు మారలే!
వీరబ్రహ్మేంద్రపురం గ్రామం

- గ్రామంలో గుడి, బడి లేదు

- మౌలిక వసతులు లేవు

- ఇళ్లు మంజూరైనా కట్టుకోలేకపోతున్నారు..

- ఇదీ వీరబ్రహ్మేంద్రపురం గిరిజనుల పరిస్థితి

జియ్యమ్మవలస, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఊరు మారితే తమ బతుకులు మారుతాయని ఆ గిరిజనులు అనుకున్నారు. తమ జీవితాలు బాగుపడతాయనే ఆశతో మనసుకు కష్టంగా ఉన్నా పుట్టిన నేలను వదిలి వేరేచోట నివాసాలను ఏర్పరచుకున్నారు. కానీ, ఇక్కడ కూడా వారి బతుకులు ఏ మాత్రం మారలేదు. అవే కష్టాలు.. అవే వెతలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊరికి రోడ్లు, కాలువలు లేవు. గుడి లేదు.. పిల్లలు చదువుకునేందుకు బడి లేదు. వర్షం పడితే బురద మధ్య సహవాసం చేయాల్సిందే. ఇదీ జియ్యమ్మవలస మండలంలోని వీరబ్రహ్మేంద్రపురం గిరిజనుల దయనీయ పరిస్థితి.

తండ్రులు చనిపోతున్నారని..

అర్నాడ పంచాయతీలో వీరబ్రహ్మేంద్రపురం గ్రామం నూతనంగా ఏర్పడింది. అందరూ జాతాపు (ఎస్టీ) కులానికి చెందిన వారే. వీరు అంతకు ముందు ఇదే పంచాయతీలో తుమ్మిగూడ గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో నివాసం ఉండేటప్పుడు ఎవరికైనా పిల్లలు పుట్టిన వెంటనే వారి తండ్రులు చనిపోతున్నారనే మూఢనమ్మకం వారిలో నాటుకుపోయింది. చనిపోయిన వారందరూ 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే నని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితి తమ తాత ముత్తాతల నుంచి ఉందని వారు అంటున్నారు. దీంతో భయపడిపోయిన 20 కుటుంబాలు వేరే చోటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై మండల తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో ఆయన స్పందించి జియ్యమ్మవలస - వనజ గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 36 సెంట్లు ప్రభుత్వ భూమిని వారు ఇచ్చారు. దీంతో హుటాహుటిన చిన్న పాకలు వేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ గ్రామానికి వీరబ్రహ్మేంద్రపురం అని నామకరణం చేసుకున్నారు. తరువాత రెండేళ్లు విద్యుత్‌ సౌకర్యం లేక, తాగడా నికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం విద్యుత్‌ సౌకర్యంతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షుడు బొంగు సురేష్‌ చొరవతో తాగడానికి నీరు అందేలా ఒక బోరు వేయించారని గ్రామస్థులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి..

  • ప్రస్తుతం గ్రామంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో 18 కుటుంబాలకు వితంతువులే యజమానులు అని వారు చెబుతున్నారు. గ్రామానికి నూతనంగా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తున్నారు. కానీ, ఇళ్లు నిర్మించుకోవడానికి కావల్సిన నీటి సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • గ్రామమంతా 39 సెంట్లలో ఉంది. కానీ ఇక్కడి బడి, దేవాలయం నిర్మించుకోవాలన్నా స్థలం లేదు. బహిర్భూమికి వెళ్లాలంటే వేసవి కాలంలో పరవాలేదు. కానీ వర్షా కాలం, సీతా కాలాల్లో నరకం చూస్తున్నామని గిరిజనులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వీటికోసం అదనంగా ఎకరా స్థలం అవసరమని, ప్రభుత్వం మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

  • గ్రామానికి సీసీ రోడ్లు గానీ, కాలువు గానీ లేవు. వర్షాలు పడితే వరద నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది. బురదలోనే ఉండాల్సి వస్తుందని వారు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు.

  • 20 కుటుంబాలు స్నానాలు, బట్టలు ఉతకడానికి దగ్గరలోని పాలెంగెడ్డలో చెలమ తీసుకుని ఆ నీటిని వాడుకుంటున్నారు. పాలెంగెడ్డ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

  • ఎవరైనా చనిపోతే పాత గ్రామం తుమ్మిగూడకు దాదాపు రెండు కిలో మీటర్లు శవాన్ని తీసుకెళ్లి ఖననం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఇబ్బందులు పడుతున్నాం

మా గ్రామంలో సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు వచ్చి చూస్తే మా పరిస్థితి వారికి అర్థమవుతుంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి.

-మండంగి పవన్‌కల్యాణ్‌, గిరిజనుడు, వీరబ్రహ్మేంద్రపురం.

=========

మా సమస్యలు పరిష్కరించండి

మా గ్రామంలో దీర్ఘకాలికంగా సమస్యలు తిష్ఠ వేసి ఉన్నాయి. అన్నీ మౌలిక సమస్యలే. మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి కాపాడండి

-ఊలక మల్లేష్‌, గిరిజనుడు, వీరబ్రహ్మేంద్రపురం.

Updated Date - Mar 05 , 2026 | 11:35 PM